Bandi Sanjay on TRS Plenary: కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 8ఏళ్ల పాలనలో తెరాస ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతుందో చెప్పకుండా భాజపా లక్ష్యంగానే ప్లీనరీ సమావేశాలు నడిచాయని అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరులో పాదయాత్ర శిబిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితికి తెరాస చేరుకుందని, రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. రెండోదశ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెరాసకు భాజపా భయం పట్టుకుందన్నారు. తాను సంధించిన 21 ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్లీనరీ తీర్మానాలు చూసి తెరాస నేతలే నవ్వుకుంటున్నారని, ఆ తీర్మానాల వల్ల రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు.
చెప్పులేసిన వాళ్లలో కేసీఆర్ లేరా? :మోదీ పాలనలో దేశఆర్ధికవ్యవస్థపై విమర్శలు చేసిన కేసీయార్ తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను అప్పులపాలు చేసింది కేసీయార్ కాదా అని ప్రశ్నించారు. మోడీ విధానాల్ని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. తెరాసకు తెలంగాణ వీఆర్ఎస్ ఇచ్చిందని, బీఆర్ఎస్ కాకపోతే,, అంతర్జాతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణకే కేసీఆర్ చేసిందేమీ లేదని, దేశానికి ఏం చేస్తారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ, సహారా కుంభకోణాలు వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్పై అభిమానం ఒలకబోసిన ముఖ్యమంత్రి ..ఆయనపై చెప్పులేసిన వాళ్లలో కేసీఆర్ లేరా చెప్పాలన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని నమ్మించడానికే తప్ప ఎన్టీఆర్పై ప్రేమతో కాదన్నారు. పార్టీ ఆస్తులు వెయ్యి కోట్లని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ ఆస్తులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఎంఐఎం పార్టీ క్యాన్సర్ లాంటిది: భాజపా మతతత్వ పార్టీ అన్న కేసీఆర్ విమర్శలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. దేశానికే ఎంఐఎం పార్టీ క్యాన్సర్ లాంటిదని, అలాంటి క్యాన్సర్ గొంతులో వేసుకున్నది ముఖ్యమంత్రేనని ఎదురుదాడికి దిగారు. ఎంఐఎం మతపార్టీ కాదా అని ప్రశ్నించారు. అవకాశమిస్తే కేసీఆర్ ముస్లింలకు 20శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్- తెరాస ఒకటేనన్న సంజయ్.. కాదని చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. భాజపాను ఒంటరిగా ఎదుర్కోలేక భాజపాయేతర పక్షాలు ఒక్కటవుతున్నాయని, ఎన్ని కూటములు ఏర్పడినా..తెలంగాణలో భాజపాదే అధికారమని స్పష్టం చేశారు.
ఎంత మంది మహిళలకు పదవులిచ్చారు?: మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి పోయిన మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు పదవులిచ్చారో చెప్పాలన్నారు. మహిళా గవర్నర్కు రాష్ట్రంలో కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తెరాస పాలనలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రజాకార్ల సమయంలోని ఆఘాయిత్యాలు తెరాస పాలనలో చూస్తున్నామన్నారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మోదీ మంత్రి పదవులిచ్చారని, ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీసీలని తెరాస పాలనలో బీసీలకు ఎన్ని మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు.