వర్షాలు వస్తే నాలుగు వైపులా నీటితో నిండుతున్న భూత్పుర్ గ్రామం BHOOTHPUR Village Problems in Telangana : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పుర్ గ్రామం. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో ఈ గ్రామం పక్కనే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. 1.313 టీఎంసీల సామర్థ్యం, 46 వేల 800 ఎకరాల ఆయకట్టు కల్గిన ఈ రిజర్వాయర్ నిర్మించారు. 2010 నవంబరు 8న ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటిస్తూ.. జీవో-122ను జారీ చేసింది. ఓవైపు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రెండోవైపు ఊర చెరువు, మూడో వైపు కల్వాల్ చెరువు, నాల్గో వైపు కాల్వ.. ఇలా ఊరికి నలువైపులా నీరే ఉండటమే ఈ గ్రామానికి శాపంగా మారింది. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్, చెరువులు, కాలువలు నిండటంతో భూత్పూర్‌లో ఊట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి, బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తుంది.
అంత్యక్రియలు జరపాలంటే నరకమే..: 982 కుటుంబాలున్న భూత్పూర్ గ్రామంలో.. 1867 మంది జనాభా ఉంటుంది. ఏటా జూన్, జులై వచ్చిందంటే చాలూ.. గ్రామస్థులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తుంటారు. వర్షాకాలంలో ప్రతి ఇంటిలో ఊట నీరు వచ్చి చేరుతుంది. పాములు, ఇతర విష సర్పాలు ఇళ్లలోకి వస్తాయి. నీరంతా రోడ్లపై నిలిచి బురదమయం కావటంతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి ఉంటుంది. చివరకు ఎవరైనా చనిపోయినా.. అంత్యక్రియలు జరపాలంటే నరకం చూడాలి. గ్రామ దుస్థితి చూసి యువకులకు పిల్లనివ్వటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
ఎన్నాళ్లీ ప్రసవ వేదన.. పాలకులు పట్టించుకోరా..?
BHOOTHPUR Village in Narayanapeta District : దాదాపు 13 ఏళ్లుగా భూత్పూర్ గ్రామస్థులు గోస పడుతున్నారు. 2010లోనే ముంపుగ్రామంగా ప్రకటించినా.. పునరావాసం మాత్రం చూపలేదు. 2015లోనే మరో చోట ఊరిని నిర్మించేందుకు గ్రామ శివారులో గల బీరప్ప గుడి వద్ద వందెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు. స్థలం ఎంపికపై అధికారుల్లో స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎన్ని గృహాలున్నాయి.. పరిహారం అంచనా.. ఇలా ఏ సర్వేను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మక్తల్, హైదరాబాద్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. చాలా మంది యువకులు తల్లిదండ్రులను వదిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ కమిటీ వచ్చి ఇక్కడ నెలకొంటున్న పరిస్థితులు పరిశీలించినా.. ఇప్పటికి నివేదిక మాత్రం ఇవ్వలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
నీరు చేరితే.. భగవంతుడిపైనే భారం..: ఈసారి జూరాలకు వరద నీరు రాకపోవటం, నీటి ఎత్తిపోతలు లేని కారణంగా ప్రస్తుతానికి సమస్య లేకున్నా.. వర్షాలు మొదలై, జలాశయాల్లోకి నీరు చేరితే మాత్రం భగవంతుడిపై భారం వేసే దయనీయ పరిస్థితులు నెలకొంటాయని గ్రామస్థులు వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి పునరావాస చర్యలు చేపట్టినా.. శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
"మా ఊరికి 2005లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. పడమటి వైపున రిజర్వాయర్ ఉంటుంది. ఉత్తర వైపున పాత చెరువు ఉంది. దక్షిణ వైపు భూములు, రిజర్వాయర్ కెనాల్ ఉంటుంది. జీవో ఇచ్చి ఇప్పటికి 13 సంవత్సరాలు అయినా అధికారులు స్పందించలేదు. పునరావాసం కల్పించలేదు. ఊట నీటి వల్ల ఇప్పటికే చాలా ఇళ్లు పడిపోయాయి. బురద నీటి వల్ల పాములు, రోగాలు ఇలాంటి వాటి వల్ల 20 మంది చనిపోయారు."- భూత్పూర్ గ్రామస్థుడు
ఇవీ చదవండి :