Bhatti Vikramarka Fires On TRS And BJP: భాజపా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తెరాస అంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. తెరాస ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. భాజపా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూల్చేసిందని ధ్వజమెత్తారు. తెరాస, భాజపా కలిసి ప్రజాస్వామ్యాన్ని జుగుప్సాకరంగా మార్చాయని దుయ్యబట్టారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుని తెరాస మంత్రి పదవులు ఇచ్చిందని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మాయ చేయాలని చూస్తున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికారం అండతో ప్రభుత్వ యంత్రాంగాలను నాశనం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం భాజపా, తెరాసకు కొత్త కాదని పేర్కొన్నారు. తెరాసలో నలుగురు మాత్రమే బయటపడ్డారు.. బయటకు రాని వాళ్లు ఇంకెందరో అని ఆరోపించారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ అపహాస్యం అవుతుందని గగ్గోలు పెట్టినా.. ఫలితం లేదని పేర్కొన్నారు. మునుగోడులోనూ రెండు పార్టీలు నేతల కొనుగోళ్లకు దిగాయని విమర్శించారు. అందుకే తెరాస, భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క కోరారు.
"ఏ రాజకీయ పార్టీ మేము చెప్పినప్పుడు ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది. తెరాస 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంది. నలుగురు మాత్రమే బయటపడ్డారు. బయటకు రాని వాళ్లు ఇంకెందరో ఉన్నారు. ఈ రెండు పార్టీలు చేసే పనులు నీచంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనించి తెరాస, భాజపాలకు బుద్ధి చెప్పాలని కోరుతున్నాం." - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత