Bandi Sanjay Letter to KCR : తెరాస ప్లీనరీలో సమాధానం చెప్పాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల పాలనపై వెయ్యి ప్రశ్నలడిగినా సరిపోదన్న సంజయ్.. లేఖలో అడిగిన ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వాలని కోరారు. 2014, 2018 ఎన్నికల హామీ పత్రాల్లోని ఎన్ని హామీలు నెరవేర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, పోడు భూములకు పట్టాలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల అమలు, దళితులకు మూడెకరాల భూమి అంశాలపై కేసీఆర్ స్పందించాలని లేఖలో పేర్కొన్నారు.
వారి చావులకు సమాధానమివ్వండి :ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించిన మాట వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీ బంధు, బీసీ-ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు- ఖర్చు, రూ.3వేల కోట్ల బీసీల బోధన రుసుములు ఎప్పుడు చెల్లిస్తారని అడిగారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు హామీ ఏమైందని ఎదరుదాడికి దిగారు. 8 ఏళ్లలో 30 వేలమంది రైతుల ఆత్మహత్యలకు సమాధానామివ్వాలని డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ అమలు ఎప్పుడు పూర్తవుతుందని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగాయని ఆరోపించిన సంజయ్ దానిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.