BANDI SANJAY: ముఖ్యమంత్రి కేసీఆర్ మత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు భీవండి కాలనీ, సింగారం గేట్, జాజాపూర్, చిన్నజెట్రం, పెద్ద జెట్రం, అంత్వర గేట్ వరకూ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు వెళ్లిన కేసీఆర్.. కేంద్రాన్ని, మోదీని తిట్టడం ఏంటని బండి మండిపడ్డారు. దసరా, దీపావళి, హనుమాన్, అయ్యప్ప దీక్షలకు ఒవైసీని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి తప్ప.. సామాన్యులకు ఉపయోగపడలేదని బండి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో కబ్జా చేసిన భూములు చాలవని.. జిల్లాకో వెయ్యి ఎకరాల భూమిని కేసీఆర్ స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వచ్చాక.. ధరణి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
‘ఛాయ్ పే చర్చ’..: ఈ క్రమంలోనే సింగారం గేటు వద్ద రైతు సదస్సులో పాల్గొన్న బండి సంజయ్.. చిన్నజెట్రంలో ‘ఛాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిథిలమైన ఇళ్లను చూసి చలించిపోయిన సంజయ్.. ముంబయికి ఉపాధి కోసం వలస వెళ్లారని తెలుసుకుని వారితో ఫోన్‌లో మాట్లాడారు. అంత్వర గేటు వద్దకు చేరుకుని.. మాదాసి, కురువ సంఘాల నాయకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అంత్వర గేటు సమీపంలో రాత్రి బండి సంజయ్ బస చేశారు. ఇవాళ కొల్లంపల్లి, లింగంపల్లి స్టేజ్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు పాదయాత్ర కొనసాగనుంది.