తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస నేతలకు మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే' - Bandi Sanjay Comments on KCR

Bandi Sanjay Comments on KCR: హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. వరి కొనకుండా కేంద్రంపై నిందలేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అసత్య వాగ్ధానాలతో విసిగిన జనం, తెరాసను ఎలాగైనా గద్దె దించాలని మండుటెండలో పాదయాత్రకు మద్దతిస్తున్నారన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో పదకొండో రోజు నారాయణపేట జిల్లాలో బండి సంజయ్​ పర్యటించారు.

bandi sanjay praja sangrama yatra
బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర

By

Published : Apr 24, 2022, 12:33 PM IST

Updated : Apr 24, 2022, 2:28 PM IST

Bandi Sanjay Comments on KCR: కేంద్రం నిధులిస్తుంటే సీఎం కేసీఆర్​ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. కొలువులు, నిరుద్యోగ భృతి అంటూ హామీలిచ్చిన కేసీఆర్​... అన్నీ మరిచి కుటుంబసభ్యులకు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో బండి సంజయ్​ పర్యటించారు. ఆరు నెలల్లోపు ఆర్డీఎస్​ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందన్న ఆయన... ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. మూడెకరాల భూమి, దళితబంధు అంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

కేంద్రం నిధులిస్తుంటే.. సీఎం కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటున్నారు: సంజయ్‌

"రాష్ట్రంలో చిన్న రోడ్లకు కూడా మర్మమతులు చేయలేకపోతున్నారు. నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేశారు. వరి కొనకుండా కేంద్రంపై నిందలు వేస్తున్నారు. ఆర్థిక సంఘాల నిధులతో రోడ్లు, మురుగుకాల్వలను కేంద్రం నిర్మించింది. మరుగుదొడ్లు, హరితహారానికి కేంద్రం నిధులిచ్చింది. కేంద్రం నిధులిస్తుంటే.. సీఎం కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకుంటున్నారు."-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

కేసీఆర్ అసత్య వాగ్ధానాలతో విసిగిపోయిన జనం, తెరాసను ఎలాగైనా గద్దె దించాలని మండుటెండలో పాదయాత్రకు మద్దతిస్తున్నారని బండి సంజయ్​ అన్నారు. కేసీఆర్​ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తెరాస వల్లే బండి సంజయ్​ను భాజపా అధ్యక్ష పదవి వరించిందన్న తెరాస నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్​లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్రాన్ని తెచ్చింది సుష్మా స్వరాజని బండి సంజయ్​ గుర్తు చేశారు. భాజపా వల్లే కేసీఆర్​ ముఖ్యమంత్రి, కేటీఆర్​ మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.

"నర్వ మండలంలో 3 జలాశయాలున్నా నీళ్లు రావడం లేదు. రూ. 400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. కేసీఆర్ ఫాంహౌస్​​కు మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేసి నీళ్లు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రజలకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్​కు మనసు రాదు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్​తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపాం. రాష్ట్రం సహకరిస్తే 6నెలలో నీళ్లు తీసుకురావొచ్చని చెప్పారు." -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అనంతరం నర్వ మండల కేంద్రంలో వాల్మీకి బోయల్ని ఆయన కలిశారు. వాల్మీకి బోయల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని.. భాజపా అధికారంలోకి వస్తే వారి సమస్యను తప్పక పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. రామాయణాన్ని ఆనాటి వాల్మీకి రాశారని.. ఇప్పటి వాల్మీకులు మాటిచ్చి తప్పిన కేసీఆర్ చరిత్ర రాయాలని కోరారు.

మతపరమైన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేంద్రం వద్దన్నా రాష్ట్రంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్న ఆయన.. వాల్మికీ బోయలను ఎస్టీ జాబితాలో ఎందుకు చేర్చరని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 70స్థానాల్లో బీసీలు, హిందువులు గెలిచే అవకాశమున్నా ఎంఐఎం గెలుస్తోందని, కేసీఆర్ లాంటి వ్యక్తులు ఎంఐఎంతో కుమ్కక్కవడంవల్లే బీసీలకు, హిందువులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

ఇవీ చదవండి:ఈ-బైక్స్​లో మంటలు.. ఆ స్కూటర్లన్నింటినీ వెనక్కి పిలిపిస్తున్న ఓలా

ఛార్జీలు పెంచినా... ఆర్థిక సంక్షోభంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు

Last Updated : Apr 24, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details