ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30శాతం నిధులను వాడుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవనంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశ కార్యక్రమంలో పలు మండలాల్లోని జడ్పీటీసీ, ఎంపీపీలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ, ఉపాధిహామీ పథకం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై రసవత్తరంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు.
"జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన మూడు తీర్మానాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతికపదికన నిధులను సమన్వయ పరుచుకొని అభివృద్ధి చేయాలి. ఎంపీపీలు, జడ్పీటిసీ సభ్యులతో కలిసి పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న పౌర సరఫరా నియంత్రణ చట్టాన్ని, కేంద్రం బలవంతంగా లాక్కున్నట్లు ఉన్నాయి."