తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండలో బాలింతలకు నరకం చూపించిన వైద్యుడు

సర్కారు దవాఖానా..ఇప్పుడీ పేరు వింటేనే భయపడాల్సి వస్తోంది. అవునూ..ఆపరేషన్ చేయాల్సిన వైద్యుడు మధ్యాహ్నం రెండింటి వరకు రాకపోవడం వల్ల బాలింతలు నరకం చూశారు. కనీసం మంచినీళ్లు కూడా లేక ఏడెనిమిది గంటలు అవస్థలు పడ్డారు. ఈటీవీ భారత్ ప్రతినిధి ఆసుపత్రికి చేరుకోవడంతో సదరు వైద్యుడు హడావుడిగా ఆసుపత్రికి చేరుకున్నారు.

నేను రాను బిడ్డో... సర్కారు దవాఖానకు

By

Published : Aug 27, 2019, 4:29 PM IST

Updated : Aug 27, 2019, 7:56 PM IST

నల్గొండలో బాలింతలకు నరకం చూపించిన వైద్యుడు

నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ మధ్యే వైద్య కళాశాల కూడా ప్రారంభమైంది. కానీ కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసేందుకు మాత్రం... ఒక్కరంటే ఒక్క వైద్యుడు కూడా లేరు. హైదరాబాద్ నుంచి డాక్టర్ వచ్చి కు.ని. ఆపరేషన్లు చేయాల్సిన దుస్థితి. పట్నం నుంచి వచ్చే వైద్యుడి కోసం బాలింతలు ఎనిమిది గంటల పాటు అవస్థలు పడ్డారు.

నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఈరోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంప్ ఏర్పాటు చేశారు. చికిత్స చేయించుకునేవారు ఏమీ తినకుండా పరికడుపునా ఉదయమే ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉదయం 5 గంటలకల్లా బయల్దేరి... ఏడు, ఎనిమిది గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. కానీ పదిన్నర, పదకొండు గంటలకు రావాల్సిన వైద్యుడు మాత్రం... మధ్యాహ్నం రెండు దాటినా కనపడకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏం తినకుండా, ఏం తాగకుండా చంటిపిల్లలతో వచ్చిన మహిళలకు బతికుండానే నరకం అంటే ఏంటో చూపించారు.

సమాచారం తెలుసుకున్న ఈటీవీ భారత్​ ప్రతినిధి ఆసుపత్రికి చేరుకుని బాలింతల బాధలపై ఆరా తీశారు. వెంటనే కళ్లు తెరిచిన సీనియర్ సహాయకుడు, అనస్థిషియా వైద్యుడు హడావుడి చేశారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన సదరు వైద్యుడికి ఫోన్ల మీద ఫోన్లు చేసి... ఎట్టకేలకు చికిత్స కేంద్రానికి రప్పించగలిగారు.

చికిత్సకు ముందు ఏడెనిమిది గంటల పాటు నిరీక్షించాల్సి వస్తే... తర్వాత కూడా మూణ్నాలుగు గంటల పాటు అక్కడే ఉండాలి. ఉదయం అనుకున్న సమయానికి పూర్తయితే... మధ్యాహ్నానికల్లా ఎవరింటికి వారు వెళ్లేవారు. కానీ వైద్యుడు నాలుగు గంటల ఆలస్యంగా రావడంతో కు.ని.కోసం వచ్చిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Last Updated : Aug 27, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details