Woman protest for husband: తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని.. అత్తింటివారే దాచిపెట్టారని ఓ భార్య ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను.. మతాలు వేరనే కారణంతో అత్తింటివాళ్లు ఎన్నో ఇబ్బందులు పెట్టారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం దిగువగాండ్లపల్లెలోని భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టింది.
నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ సనా...2019లో ఈసెట్ శిక్షణలో ఉండగా చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 4న మదనపల్లె మండలంలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు నుంచే అత్తింటివారు తనకు ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారని వాపోయారు. అందుకే ఇటీవల మదనపల్లె ఎస్టేట్‌లో ఓ అద్దె ఇంటికి వెళ్లామని చెప్పింది. మూడు రోజుల కిందట రమేష్‌కుమార్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని... అత్తింటివారిని అడిగితే మాకు తెలియదని చెప్పారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని సనా వివరించారు. మతాంతర వివాహం చేసుకోవడం వల్లనే అత్తింటివారు తనను గృహహింస పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్‌కుమార్‌ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు వైకాపా నాయకులు తనను బెదిరించడంతో పాటు కొట్టారని, తాను వెళ్లనని పట్టుబట్టడంతో ఇలా చేశారని.. తన భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని ఆమె కోరారు.
"2019లో నేను ఈసెట్ శిక్షణలో ఉండగా రమేష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి 4న మదనపల్లె మండలంలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం. మరుసటి రోజు నుంచే అత్తింటి వారు నాకు ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఇటీవల మదనపల్లె ఎస్టేట్‌లో ఓ అద్దె ఇంటికి వెళ్లాం. మూడు రోజుల కిందట రమేష్‌కుమార్ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అత్తింటివారిని అడిగితే మాకు తెలియదని చెప్పారు. మతాంతర వివాహం చేసుకోవడంతో అత్తింటి వారు తనను గృహహింస పెట్టారు. రమేష్‌కుమార్‌ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు వైకాపా నాయకులు తనను బెదిరించడంతో పాటు కొట్టారు."