organ donation in nalgonda: తన కుమారుడి నిశ్చితార్థం వేడుకల్లో ఆ తల్లి సంతోషంగా పాల్గొంది. కొద్ది సేపు అంతా బాగానే గడిచింది. కానీ అంతలోనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేయి దాటి బ్రెయిన్ డెడ్ అయి నిర్జీవంగా పడి ఉన్న భార్యను చూసి భర్త, పిల్లలు గుండెలవిసేలా రోదించారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు తమ ఉదార గుణాన్ని చాటుకున్నారు.
నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన పద్మ మరణంలోనూ జీవించారు. తన ప్రాణాలు పోయినా మరో ఐదుగురికి ప్రాణదానం చేసి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. వెంపటి లక్ష్మీనారాయణ, పద్మ దంపతులు తమ కుమారుడి సంతోష్ వివాహ నిశ్చితార్థం వేడుకల కోసం కోదాడ వెళ్లారు. ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక్కసారిగా పద్మ కుప్పకూలిపోయారు.