మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పూర్వీకుల ప్రాంతమైన నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జైలు నిర్మాణానికి 289 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించగా.. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ద్వారా జైళ్ల శాఖకు భూమి బదిలీ కూడా చేశారు. ఇక్కడ నిర్మించనున్న జైలులో వ్యవసాయ పనులతో ఖైదీలకు స్వయం ఉపాధి కల్పించాలని సంకల్పించారు.
నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతానికి ఇది దగ్గరగా ఉండటంతో పెద్దఎత్తున వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి, వనమూలికలు, పండ్లతోటలు, కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రభుత్వం సైతం రూ.50 కోట్లు మంజూరు చేసింది. అప్పటి జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్‌తో పాటు జిల్లా, రాష్ట్ర అధికారులు పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.