ఆలమట్టి నుంచి పులిచింతల వరకు కృష్ణానదిలో ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ఆలమట్టికి గురువారం సాయంత్రానికి 2.69లక్షల క్యూసెక్కులు వస్తుండగా అది శుక్రవారం సాయంత్రానికి 2.94 లక్షలకు చేరుకుంది. దిగువకు 2.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 2.59 లక్షల క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. జూరాలకు 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా దిగువకు 3.46 లక్షలు వదులుతున్నారు. శ్రీశైలానికి 3.93లక్షల క్యూసెక్కుల వస్తుండగా దిగువకు 3.43 లక్షలు విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు వరద పోటు
ఎగువ నుంచి భారీ ప్రవాహాలకు తోడు కృష్ణా పరీవాహకంలో ఏకధాటి వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు పోటెత్తుతోంది. శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రాజెక్టు 4 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన శ్రీశైలం నుంచి క్రమంగా పెరుగుతూ 4,07,570 క్యూసెక్కుల వరద వస్తుండడంతో రాత్రికి 18 గేట్ల ద్వారా 1,38,240 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి, ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు కలిపి మరో 30వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి కిందికి వెళుతోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ 586 అడుగుల వద్ద ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 300 టీఎంసీలు ఉంది. రానున్న మూడురోజుల్లో కృష్ణా పరీవాహకానికి 130 టీఎంసీల మేర వరద ప్రవాహం కొనసాగే అవకాశమున్నందున.. పరీవాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని సాగర్ ప్రాజెక్టు సీఈ నర్సింహ వెల్లడించారు.