Vizag colony tourism : ఎటుచూసినా ఎత్తైన కొండలు.. మధ్యలో అద్భుత జలదృశ్యం.. రహదారిని ఆనుకుని అందమైన లోగిళ్లు.. చూడ్డానికి అదో చిన్న తీర పట్టణాన్ని తలపిస్తుంది. వైజాగ్ కాలనీ.. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చూడడానికి చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు.
కొండల నడుమ అందాల జలదృశ్యం
By
Published : Dec 26, 2021, 7:56 AM IST
Vizag colony tourism : పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు... మైమరిపించే జలదృశ్యం... అదే వైజాగ్ కాలనీ. కొండకోనల మధ్య విహారం, ఆహ్లాదకర వాతావరణం, బోటింగ్... సరికొత్త పర్యాటక ఆకర్షణగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకే కాదు చేపల రుచులకూ ప్రత్యేకం. సరైన ప్రచారం, కనీస సౌకర్యాలు లేకున్నా ఇక్కడకు పర్యాటకుల తాకిడి మాత్రం పెరుగుతోంది.
Nalgonda Tourism : నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ఆమ్రాబాద్ అభయారణ్యంలో భాగంగా ఈ ప్రాంతం ఉంది. ఈ మండలంలో సాగర్ బ్యాక్ వాటర్‌కు ఆనుకుని ఉన్న పెద్ద మునిగెల్, చిన్న మునిగెల్, వైజాగ్‌కాలనీ, బుగ్గతండా, కాశరాజుపల్లి, సుద్దబాయి తండా మీదుగా దేవరచర్లకు మొత్తం దాదాపు 15 కిమీ మేర వంపులు తిరుగుతూ సాగే రహదారి అద్భుతమైన అనుభూతినిస్తుంది. పచ్చదనంతో కనువిందు చేసే కొండల నడుమ, గిరిజన తండాల మీదుగా ప్రయాణిస్తుంటే కలిగే ఆనందం అంతాఇంతాకాదు. ఇక్కడి రహదారులపై ఆరబోసిన చేపలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తుంటాయి.
కనువిందు చేసే కాలనీ..
BackWater in Nalgonda : బ్యాక్‌వాటర్‌లో రేయింబవళ్లు చేపలవేట సాగించే మత్య్సకారుల జీవన సౌందర్యం కట్టిపడేస్తుంది. ఇక్కడున్న మూడొందల కుటుంబాల్లో అత్యధికులు విశాఖ జిల్లా నుంచి వచ్చిన మత్స్యకారులే. నాగార్జునసాగర్ డ్యాం నిర్మించాక వీరంతా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. కొద్దిమంది మహారాష్ట్ర, ఒడిశా మత్స్యకారులు కూడా ఇక్కడున్నారు. ఇటీవల పర్యాటకులు పెరగడంతో భోజన ఏర్పాట్లు, కిరాణా షాప్‌ల ద్వారా ఉపాధి పొందుతున్న వారూ చాలామంది కనిపిస్తారు. ఇక్కడకు వచ్చేవారు చేపల పులుసు, ఫ్రై వంటకాలు ప్రత్యేకంగా చేయించుకుని రుచి చూస్తుంటారు. ప్రస్తుతం ఆదివారం 300 వరకు వాహనాలు వస్తున్నాయి. వసతిగృహాలు కట్టిస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుందని వైజాగ్‌కాలనీ సర్పంచి దూడ భావోజి అభిప్రాయపడ్డారు.
*వైజాగ్‌కాలనీకి చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దేవరచర్లలో ముని శివాలయం, రాక్షసగుళ్లు, ఆదిమమానవుల గాజుబేడ గుహలు, అంబా భవానీ ఆలయంతో పాటు పెద్ద మునిగేల్, కాసరాజుపల్లిలోని పుష్కరఘాట్లు, తిరుమలను తలపించే కొండలు కనువిందు చేస్తాయి. అమ్రాబాద్ అభయారణ్యంలో భాగం కావడంతో అప్పుడప్పుడు పులులతో పాటు చిరుతులు, ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి.
*హైదరాబాద్-నాగార్జునసాగర్ మార్గంలో మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఉందీ ప్రాంతం.