Vinod suffering from Muscular Dystrophy in Nalgonda: కండరాల క్షీణిత వ్యాధితో ఎనిమిదేళ్లగా మంచానికే పరిమితమైన కూమారుడిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఉన్నదంతా పెట్టి అందినకాడికి అప్పులు చేసి చికిత్స చేయించారు. వైద్యఖర్చులు భరించే స్థోమత లేక కుమారుడి దీనస్థితిని చూడ లేక కుమిలి పోతున్నారు. కూలీనాలి చేస్తే వచ్చే డబ్బులతో పూట గడవడమే కష్టంగా మారిన కష్ట సమయంలో ఆపన్న హస్తాల కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.
నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ గ్రామానికి చెందిన శోభారాణి, దశరథ దంపతులు 18 ఏళ్ల క్రితం బతుకు దెరువుకోసం చిట్యాల మండలం నేరడ గ్రామానికి వచ్చారు. వీరికి విగ్నేశ్వరి, వినోద్ కుమార్ సంతానం. కుమారుడు వినోద్ కుమార్ ఎనిమిదేళ్ల వయస్సులో అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాడు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయి కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆయుర్వేదం, హోమియోపతి, నాటు వైద్యం అంటూ తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. సంపాదించిన ప్రతి పైసా వినోద్ వైద్యానికే ఖర్చు చేసినా.. అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు.
వినోద్‌ను పరిశీలించిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు కండరాల క్షీణత వ్యాధి వచ్చిందని తేల్చారు. ఎవరో ఒకరు సాయం ఉంటే తప్ప ఏ పనీ సొంతంగా చేసుకోలేడు. అతడి దైనందిన జీవితం ముందుకు సాగదు. కుమారుడి వైద్యం కోసం ఆస్తుల్ని అమ్ముకుని చికిత్సకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఓ అద్దె గదిలో బతుకు వెళ్లదీస్తున్నారు. వినోద్ సేవలకే తల్లి పరిమితమైంది. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తేనే పూట గడిచేది.