Vigilance Focus on Yadadri Thermal Power Plant : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్ బృందం ఫోకస్ పెట్టింది. ప్లాంట్ నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నేపథ్యంలో ప్లాంట్‌లోని పలు కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్ శాఖకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్లాంట్ నిర్మాణ సమయం నుంచి జరిగిన భూ సేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తిస్థాయి విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పెరిగిన అంచనా వ్యయం : కృష్ణా పరీవాహక ప్రాంతమైన వీర్లపాలెంలో విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 8న భూమిపూజ చేశారు. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 4000ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో, రూ.28,000ల కోట్ల అంచనా వ్యయంతో 2017లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈ వ్యయం రూ.55,000ల కోట్ల వరకు పెరిగింది.
Yadadri thermal power plant: యాదాద్రి వెలిగేదెప్పుడో.. నత్తనడకన థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు
పరిహారం చెల్లింపులపై ఆరోపణలు : ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, బూడిద నిల్వలు, బొగ్గు, రిజర్వాయర్, ఇతర ప్లాంట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 4,200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ప్రభుత్వ, అటవీ, పట్టా భూములున్నాయి. అటవీ భూములకు బదులుగా మరోచోట భూములను కేటాయించారు. పట్టా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.6.5 లక్షలను పరిహారంగా నిర్ణయించారు. ఈ పరిహారం చెల్లింపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూములు కోల్పోని స్థానిక గిరిజనుల పేర్లతో పరిహారాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పంచుకున్నారని నిర్వాసితులు ఆరోపించారు.