తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇప్పుడు దత్తత అంటున్నారు.. ఇన్ని రోజులు మునుగోడు గుర్తుకురాలేదా' - మునుగోడు తాజా రాజకీయాలు

Kishan Reddy Fires on KTR: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డి.. కేటీఆర్​పై ఘాటు విమర్శలు చేశారు. 1200 మంది బలిదానంతో ఏర్పాటైన తెలంగాణలో తండ్రీకుమారుల కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. కేటీఆర్​కు ఎన్నికలప్పుడే దత్తత గుర్తుకువస్తుందని ఎద్దేవా చేశారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Oct 15, 2022, 9:32 PM IST

Kishan Reddy Fires on KTR: మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని లింగారెడ్డిగూడెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్​పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. 1200 మంది బలిదానంతో ఏర్పాటైన తెలంగాణలో తండ్రీకుమారుల కుటుంబ పాలన సాగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఫామ్​హౌజ్​​లోనే పడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అవినీతి పాలన కావాలా.. ప్రజాస్వామ్య పాలన కావాలా.. అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఎన్నికలప్పుడే కేటీఆర్​కు దత్తత గుర్తుకు వస్తుంది: కిషన్​ రెడ్డి

మంత్రి కేటీఆర్​కు ఉప ఎన్నికలప్పుడే దత్తత గుర్తుకువస్తుందని.. మునుగోడును దత్తత తీసుకుంటామని అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మునుగోడును కేటీఆర్​ ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఉట్టికి ఎగరలేని అమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లు కేసీఆర్​ తెరాసను భారాసగా ప్రకటించడం చాలా హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మతపరమైన రిజర్వేషన్లు తీసివేస్తామని కిషన్​రెడ్డి ప్రకటించారు. బంజారాలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. మునుగోడు ప్రజలు పులిబిడ్డలని నిరూపించాలని.. అందరూ భాజపాకు ఓటు వేసి రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

"అప్పుడు రాజగోపాల్​రెడ్డి కూడా కాంగ్రెస్​తో పోరాడి తెలంగాణ తీసుకురావడానికి ఎంతో చేశారు. ఎంతో మంది బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణను ఇప్పుడు కేసీఆర్​ కుటుంబం 8 సంవత్సరాలుగా పాలిస్తోంది. అప్పుడు తెరాసకి ఓట్లు వేస్తే దళితులకు ముఖ్యమంతి స్థానంలో కూర్చోపెడతాం అన్నారు. ఆ మాట ఏం అయ్యింది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక వస్తే కేటీఆర్​కు దత్తత గుర్తుకువస్తుంది. ఇన్ని రోజులు మునుగోడు గుర్తుకురాలేదా.. కేసీఆర్​కి ప్రజల కష్టాలు కనపడవు.. ఎప్పుడూ ఫాంహౌజ్​​లోనే ఉంటారు".- కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details