బరిలో అందరూ కొత్తవారే:
కాంగ్రెస్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలో దింపింది. ఈ పరిస్థితుల్లో అధికార తెరాస అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగు వేసింది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ పోటీకి దిగేందుకు విముఖత చూపినందున అనూహ్యంగా వేమిరెడ్డి నర్సింహారెడ్డిని రంగంలోకి దింపింది. భాజపా నుంచి గార్లపాటి జితేందర్ బరిలో నిలిచారు. సీపీఎం నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు మల్లు లక్ష్మి పోటీలో ఉన్నారు.
అనూహ్యంగా తెరపైకి వేమిరెడ్డి:
ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, నియోజకవర్గంతో సంబంధాలు పెద్దగా లేని వేమిరెడ్డి నర్సింహారెడ్డి అనూహ్యంగా తెరాస టికెట్ దక్కించుకున్నారు. ఈయనది మునుగోడు మండలం చల్మెడ గ్రామం. చాలా కాలం నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రాజధాని బ్యాంకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డికి మూడు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. ఆయనతో పాటు జిల్లాలో అనేక మంది సీనియర్ నేతలను కాదని... కేసీఆర్ వేమిరెడ్డికి అవకాశం ఇవ్వడం వెనుక అసలు రహస్యం ఎవరికి అంతు చిక్కటం లేదు. ఉత్తమ్‌కు నర్సింహారెడ్డి ఏ మేరకు పోటీనిస్తారోనని ఆసక్తి నెలకొంది.