తెలంగాణ

telangana

ETV Bharat / state

Handlooms: నేతన్నల బిడ్డలు కొత్తతోవ చూపుతున్నారు! - తెలంగాణ వార్తలు

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న చేనేత కళాకారుడి బిడ్డ ఆమె... పదిహేనేళ్ల వయసులో తండ్రికి దూరమైనా ఆయన కళని అందిపుచ్చుకుని శెభాష్‌ అనిపించుకుంది చందన!. పడుగు-పేకల ప్రపంచంలోనే పుట్టి ఎదిగిన హారిక నేత పని చేసే తండ్రి కలనీ సాకారం చేయాలనుకుంది.. ఈ ఇద్దరివీ వేర్వేరు కుటుంబాలే అయినా లక్ష్యం ఒక్కటే! తమ పరిధిలో నేతన్నకు సుస్థిర ఉపాధి కల్పించాలని. ఆ దారిలో వాళ్లు సాధిస్తోన్న విజయాలేంటో చూద్దాం...

Handlooms, online business
చేనేత, ఆన్​లైన్ వ్యాపారం

By

Published : Jul 7, 2021, 8:45 AM IST

తన చేతుల్లో తయారవుతున్న వస్త్రం అందంగా ఉంటే చాలనుకుంటాడు కానీ.. చిక్కిశల్యమవుతున్న తన శరీరాన్ని పట్టించుకోని త్యాగం నేతన్నది. అలాంటి చేనేత కళాకారులని కొవిడ్‌ చావుదెబ్బతీసింది. దుస్తులకు గిరాకీ లేదు. అందుకే చేనేత సహకార సంఘాల్లో కోట్ల రూపాయల నిల్వలు పేరుకుపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 సహకార సంఘాలకుగాను 36 క్రియాశీలకంగా ఉండేవి. అవీ రెండేళ్లుగా చురుగ్గా లేవు. వీటన్నింట్లో అగ్రగామి కొయ్యలగూడెం చేనేత సహకార సంఘం సైతం తీవ్రమైన ఒడుదొడుకులకు లోనైంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిలే చందన, హారికలు. హైవరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉండే కొయ్యలగూడెం చేనేత కళాకారులకు నిలయం. ‘కోయ్స్‌ ఇక్కత్‌’ అని పిలుచుకొనే ఇక్కడి నూలు వస్త్రాలది ప్రపంచఖ్యాతి. అమెరికా అధ్యక్ష భవనం అలంకరణలో భాగమవుతున్నాయంటేనే వాటి ప్రత్యేకత అర్థమవుతుంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి నేతన్నలను గట్టెక్కించాలనుకున్నారు 18 ఏళ్ల వయసున్న చందన, హారికలు. తాము ఉపాధి పొందుతూ మరికొందరికీ దారి చూపాలన్న తపనతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలుగా దేశవిదేశాలకు వస్త్రాలను సరఫరా చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ 50 మగ్గాలకు పని కల్పిస్తున్నారు.

విషాదం నుంచి విజయం దాకా... కొయ్యలగూడెం సహకార సంఘంలో 580 మంది సభ్యులున్నారు. వీళ్లు కాక మరెన్నో కుటుంబాలు నేత వస్త్రాలపై ఆధారపడ్డాయి. డబుల్‌ ఇక్కత్‌ నమూనా రూపొందించి 2014లో జాతీయ హస్తకళల పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న కళాకారుడు ఇడెం శ్రీనాథ్‌. ఆయన కుమార్తే చందన. పనిలో చిన్నప్పట్నుంచీ అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా నిలిచిన ఆమె తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. శ్రీనాథ్‌ కళానైపుణ్యాన్ని చూసి మురిసిపోవడానికి ఆయన ఇంటికి ఎంతో మంది విదేశీయులు వస్తుండేవారు. దురదృష్టం. ఆయన 2018లో కేన్సర్‌తో మరణించారు. అప్పటికి చందనకు 15 ఏళ్లు. తమ్ముడు తనకన్నా ఏడేళ్ల చిన్నవాడు. కుటుంబానికి తనే అండగా నిలబడాలని చదువుకుంటూనే నేత పనిచేసేది. తండ్రి స్ఫూర్తితో శ్రీనాథ్‌ ఫ్యాబ్రిక్స్‌ పేరిట వస్త్రవ్యాపారాన్ని నడుపుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీలలో జాతీయ స్థాయి మేళాల్లో పాల్గొని కొయ్యలగూడెం నేతన్నల పనితీరును కళ్లకు కట్టింది. ఫర్వాలేదు అనుకొనే సమయానికి కరోనాతో అమ్మకాలు లేక పరిస్థితి మొదటికొచ్చింది. అయినా కుంగిపోకుండా ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రారంభించి నెలకి రూ.లక్షన్నరకు పైగా ఆర్జిస్తోంది. మరెన్నో కుటుంబాలకూ అండగా నిలబడుతోంది.

తండ్రి, తాతల వారసత్వాన్ని సొంతం చేసుకున్న వడ్డేపల్లి హారిక సైతం ఆన్‌లైన్‌ వ్యాపారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. వినూత్న డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోసం రెండేళ్ల క్రితం కళాశాలలో చేరినా చదువు ఆగిపోయింది. కుటుంబ ఇబ్బందుల్ని గమనించి ఇంట్లో ఖాళీగా ఉండకుండా... సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ‘ఇక్కతైమ్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించి ప్రత్యేక డిజైన్లు నేయించడం మొదలుపెట్టింది. వాటికి మిర్రర్‌ వర్క్‌, ఎంబ్రాయిడరీ చేయిస్తోంది. చీరతోపాటు బ్లవుజులూ అందిస్తూ వాటికి ప్రముఖ మోడల్స్‌తో ప్రచారం చేయిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా చేసిన వినూత్న ప్రయోగానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. కంబోడియా, ఉజ్బెకిస్థాన్‌ దేశాల సంప్రదాయ వస్త్రాలకు మన ఇక్కత్‌ సొగసులు జోడించి నూతన రీతిలో మగ్గాలపై నేయిస్తోంది. అలా ఆన్‌లైన్‌ ద్వారా నెలకు లక్షల రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది హారిక. సొంతంగా 10 మగ్గాలు నడిపించడంతోపాటు ఇతర చేనేత కార్మికులు నేసిన చీరల్నీ అమ్మిపెడుతోంది. ఒకప్పుడు హారిక తన తండ్రి మహేశ్వరం, తల్లి మాధవి వెంట దిల్లీహాట్‌, సూరజ్‌ కుండ్‌, పుణె, బెంగళూరు, కోల్‌కతాల్లో జాతీయ, అంతర్జాతీయ మేళాల్లో పాల్గొంది. 2019 దిల్లీ మేళాలో సోనియాగాంధీ వీరి స్టాల్‌ను సందర్శించి హారికతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు.

ఇద్దరూ ఇద్దరే..

చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, దుపట్టాలు, బెడ్‌ షీట్లను వినూత్న డిజైన్లతో నేయించి, ఫొటోలు తీసి వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారీ ఇద్దరు అమ్మాయిలు. చేనేత కళను మరింతగా అభివృద్ధి చేసేలా, మగ్గాలు ఆగకుండా కార్మికులందరికీ పని దొరికేలా చేయడమే తమ లక్ష్యమంటున్నారు.

ఇదీ చదవండి:whatsapp: బ్లాక్‌ చేశారని తెలుసుకోవడమెలా..?

ABOUT THE AUTHOR

...view details