తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లిఒడిలో సేదతీరాల్సిన వయస్సులో.. తలసేమియాతో నరకం

తల్లి ఒడిలో జోలపాట వింటూ హాయిగా సేదతీరాల్సిన ఆ చిన్నారులకు భరించలేని నరకయాతన. స్నేహితులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆడుకోవాల్సిన వయస్సులో మోయలేనంత భారమైన బాధ. పున్నమి చంద్రునిలా కళకళలాడాల్సిన వారి జీవితాలు.. తలసేమియా అనే వ్యాధితో అమావాస్య చంద్రునిలా వెలవెలబోతున్నాయి. కళ్ల ముందే తమ చిన్నారులు పడుతున్న నరకయాతనను చూడలేని ఆ తల్లిదండ్రుల వేదన సంద్రమంతా..

two sons in a family are suffering from thalassemia in nalgonda
తలసేమియాతో నరకం

By

Published : Dec 18, 2020, 2:59 PM IST

తలసేమియా అంటే గ్రీకులో సముద్రం అని అర్థం. నిజంగానే ఇది సముద్రంలా అంతులేని వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారికి జీవితాంతం రక్తం అందిస్తూనే ఉండాలి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో పాతకోటి మైసయ్య, కళమ్మ దంపతులకు పెళ్లై ఆరేళ్లు. ఎన్నో మొక్కులు మొక్కిన తర్వాత మగపిల్లాడు పుట్టాడని ఎంతో సంతోషపడిన ఆ దంపతులకు బాబు పుట్టిన వారం రోజులకే తలసేమియా వ్యాధి బారిన పడ్డాడని తెలిసింది.

ఇద్దరు కుమారులకు..

ప్రాణాంతక వ్యాధి బారిన పడిన తమ కుమారుణ్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ తల్లిదండ్రులకు మరో షాక్ తగిలింది. తమ రెండో బాబు కూడా పుట్టిన ఆరు నెలల తర్వాత తలసేమియా బారిన పడ్డాడు. పెద్ద కుమారుడి తర్వాత పుట్టిన కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. మైసయ్య, కళమ్మ దంపతులు తమ ఇద్దరు కుమారులు నాగరాజు, కృపాకర్​లకు హైదరాబాద్ రాజేంద్రనగర్​ శివరాంపల్లిలోని టీఎస్​సీఎస్​ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 15 రోజులకోసారి వారికి రక్తం ఎక్కించుకుని తీసుకువస్తున్నారు.

12 ఏళ్ల వయస్సులో.. 12 రకాల మందులు

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది.. ఉన్న ఇద్దరు కుమారులకు 15 రోజులకోసారి రక్తమార్పిడి, మందులకు దాదాపు ఒక్కరికి రూ.5 నుంచి 10 వేల దాకా ఖర్చవుతోందని మైసయ్య తెలిపారు. తమ కుమారులకు మెరుగైన చికిత్స అందించడానికి తమ ఆర్థిక స్తోమత సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల వయసులో.. స్నేహితులతో కలిసి ఆడిపాడాల్సిన వారు 12 రకాల మందులు మింగుతూ జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు.

సాయం చేయండి

తమ పరిస్థితి చూసిన అధికారులు.. నెలకు రూ.1000 వచ్చే గ్రామ పంచాయతీ కార్మికునిగా నియమించారు. ఆ జీతం వారు ఒకసారి ఆసుపత్రికి వెళితే ఛార్జీలకే సరిపోతుంది. ఒక్కోసారి ఛార్జీలకు కూడా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నారని, తమకు చేతనైనంత సాయం చేస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి వారి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

ప్రభుత్వమే చేయూతనివ్వాలి..

ఏటా దేశంలో 12 వేల మంది చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారు. అందులో వెయ్యి మంది తెలంగాణలోనే ఉంటున్నారు. దీనికి చికిత్స ఒకటే 15 నుంచి 20 రోజులకోసారి రక్తం ఎక్కించడం లేదంటే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం. ఇది చాలా ఖరీదైనది. దీనికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసినా దాని సక్సెస్ రేటు 20 నుంచి 30 శాతమే. తలసేమియా బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఆర్థికంగా చేయూతనివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details