తెలంగాణ

telangana

ETV Bharat / state

Nagarjuna Sagar: ముదురుతున్న జలజగడం.. సాగర్‌లో ఏపీ అధికారులకు చుక్కెదురు - sagar Power generation issue in telangana

TS police sent back AP officers in Sagar
TS police sent back AP officers in Sagar

By

Published : Jul 1, 2021, 2:18 PM IST

Updated : Jul 1, 2021, 8:02 PM IST

14:15 July 01

సాగర్‌లో ఏపీ అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు

సాగర్‌లో ఏపీ అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడంలో ఇవాళ భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ అధికారులకు లేఖ ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులకు నాగార్జునసాగర్ వద్ద తిరస్కరణ ఎదురవగా... పులిచింతల ప్రాజెక్టు వద్ద సమ్మతి లభించింది. మరోవైపు జలాశయాలకు ఇరువైపులా... రెండు రాష్ట్రాల బలగాలు పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నాయి.

వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే...

జల విద్యుత్తు ఉత్పత్తి విషయంలో నెలకొన్న వివాదంతో... రెండు రాష్ట్రాల అధికారులు పరస్పరం భేటీ అయ్యేందుకు యత్నించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులకు తెలంగాణ వైపు నాగార్జునసాగర్ వద్ద తిరస్కారం ఎదురుకాగా... పులిచింతల వద్ద ఆహ్వానం లభించింది. జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున ఉత్పత్తి నిలిపివేయాలంటూ... సాగర్ కొత్త వంతెన వద్దకు ఏపీ అధికారులు చేరుకున్నారు. ఎస్ఈ పురుషోత్తమ గంగరాజు, గురజాల ఆర్డీవో పార్థసారథి, మాచర్ల డీఎస్పీ సహా నీటిపారుదల శాఖకు చెందిన సిబ్బంది... నాలుగు వాహనాల్లో రాష్ట్ర సరిహద్దు వద్దకు వచ్చారు. జెన్కో సీఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తామని చెప్పగా... ఏపీ అధికారుల బృందాన్ని పోలీసులు ఆపేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్​రావు ఆధ్వర్యంలో... ఏపీ అధికారులను తెలంగాణ వైపు రాకుండా అడ్డుకున్నారు.

చేసేదేమీ లేక తిరుగుపయనం..

సదరు అధికారులు వంతెన వద్దే వాహనాలు దిగి... అక్కణ్నుంచే జెన్కో సీఈతో ఫోన్లో మాట్లాడారు. వినతిపత్రం తీసుకునేందుకు తమకు అధికారం లేదని సమాధానమిచ్చారు. కావాలంటే.. డీఐజీకి ఇచ్చి వెళ్లాలని సీఈ సూచించారు. ఇది శాంతి భద్రతల సమస్య కాదని... విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించింది కాబట్టి.. మీకే వినతిపత్రం ఇస్తామంటూ సీఈకి తెలియజేశారు. తనకు పని ఉందంటూ సీఈ ఫోన్ కట్ చేయగా... ఏపీ అధికారులుకు ఏం చేయాలో తోచలేదు. అధికారులు అనుమతివ్వలేదు కాబట్టి.. వెంటనే వెళ్లిపోవాలంటూ రాష్ట్ర పోలీసులు ఏపీ అధికారులను పంపించేశారు. చేసేదేమీలేక ఎస్ఈ, ఆర్డీవో సహా అధికారులంతా అక్కణ్నుంచే వెనుదిరిగారు.

ఎస్పీల పరిశీలన..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బందోబస్తును పరిశీలించేందుకు... ఇరు జిల్లాల ఎస్పీలు డ్యాం వద్దకు చేరుకున్నారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ... రైట్ బ్యాంక్ రివర్ అతిథి గృహంలో కాసేపు సంభాషించుకున్నారు.

పులిచింతల వద్ద సమ్మతి...

పులిచింతల వద్ద సైతం విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ అధికారులు... తెలంగాణ అధికారులను కలిసి లేఖ సమర్పించారు. జెన్కో ఎస్ఈ దేశ్యా నాయక్​కు పొరుగు రాష్ట్ర అధికారులు లేఖ ఇచ్చారు. ఏపీ వైపు పులిచింతల డ్యాం ఎస్ఈ పేరున గల లేఖను... ఈఈ శ్యాంప్రసాద్ అందజేశారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తును సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ పరిశీలించారు. అదే సమయంలో ఏపీ అధికారులు డ్యాం పైకి చేరుకున్నారు. ఎస్ఈ దేశ్యానాయక్, ఎస్పీ భాస్కరన్​తో కాసేపు చర్చించారు.

భారీగా బందోబస్తు..

నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ వైపు... రెండు వందల మంది పోలీసులతో భద్రత మోహరించారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐల ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు భద్రత పర్యవేక్షించే ఎస్పీఎఫ్​తో పాటు జెన్కో పోలీసు సిబ్బంది, వంద మంది అదనపు ప్రత్యేక బలగాలు పహారా కాస్తున్నాయి. అటు ఏపీ వైపు అదే స్థాయిలో బలగాలు మోహరించాయి. ఇక పులిచింతల వద్ద రాష్ట్రం తరఫున... 90 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. 

ఇదీ చూడండి:Minister srinivas Goud : మీ వాటా తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి

Last Updated : Jul 1, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details