TRS Munugode Bypoll Campaign: మునుగోడు ఉపఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కార్యక్షేత్రంలో జోరు మీదున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ఇతర ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలంతా మునుగోడులోనే బస చేస్తూ ఊరూరా తిరిగి తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మునుగోడులో కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
ఉపఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే గ్యాస్, ఇంధన ధరలు పెంచడాన్ని మనం అంగీకరించినట్లువుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం చల్లవాని కుంటలో ఆమె ఓటర్లను కలిసి కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. నాంపల్లి మండలం రాజ్య తండాలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు ఇస్తున్న కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని మాలోతు కవిత కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం భాజపాలోకి వెళ్లారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ప్రచారం నిర్వహించిన మంత్రి.. కాంగ్రెస్, భాజపాలకు మునుగోడు ఉపఎన్నికల్లో డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు. రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్రం నుంచి రూ.2 వందల కోట్ల నిధులు విడుదల చేయించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.