'కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ'
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అనుముల, త్రిపురారం మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తెరాస అభ్యర్థి నోముల భగత్ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక దగ్గరపడుతున్న వేళ తెరాస ప్రచారం జోరందుకుంది. అనుముల మండలం హాలియాలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో అభ్యర్థి నోముల భగత్కుమార్తో పాటు హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నోముల లక్ష్మీ పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రె పిల్లను ఎత్తుకొని ప్రచారంలొ పాల్గొనటం ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది. నోముల నర్సింహయ్య పేదల మనిషి, ఉక్కు మనిషి అని కొనియాడిన హోమంత్రి మహమూద్ అలీ... భగత్కుమార్కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఓపిక లేక ప్రచారం చేయలేక జానారెడ్డి నీరసపడిపోతున్నాడని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ అని.... జానారెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు. త్రిపురారం మండలం కంపాసాగర్, అన్నారం, దుగ్గేపల్లిలో ఎన్నికల ప్రచారం చేసిన తెరాస అభ్యర్థి నోముల భగత్... ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.