తెలంగాణ

telangana

ETV Bharat / state

'మునుగోడులో గెలుపు మాదే'.. విజయంపై తెరాస ధీమా..! - Munugode By Poll Results

TRS to win Munugode By Poll : మునుగోడు ఉపఎన్నికల్లో విజయంపై గులాబీ పార్టీ పూర్తి ధీమాతో ఉంది. భారీ పోలింగ్ సహా అక్కడ చోటు చేసుకున్న పరిణామాలన్నీ తమకే అనుకూలమని తెరాస విశ్లేషిస్తోంది. ప్రచారం నుంచి పోలింగ్ వ్యూహం వరకు అన్నీ సత్ఫలితాలివ్వబోతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయం ఖాయమని పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 20 వేలకు పైగా మెజారిటీ రానుందని మంత్రి హరీశ్​రావు అంచనా వేశారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన తెరాస శ్రేణులకు ధన్యవాదాలంటూ కేటీఆర్ ప్రకటన జారీ చేశారు.

మునుగోడులో అంత మెజారిటీతో గెలుస్తున్నాం.. విజయంపై తెరాస ధీమా..!
మునుగోడులో అంత మెజారిటీతో గెలుస్తున్నాం.. విజయంపై తెరాస ధీమా..!

By

Published : Nov 4, 2022, 8:40 AM IST

TRS to win Munugode By Poll : ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మునుగోడు ఎన్నికల్లో విజయం తమదేనని తెరాస గట్టి విశ్వాసంతో ఉంది. మొదటి నుంచీ వ్యూహ, ప్రతివ్యూహాలు.. ఎత్తులు, పైఎత్తులతో వ్యవహరించిన గులాబీ పార్టీ.. తమ గెలుపు ఖాయం అంటోంది. నిన్న పోలింగ్ సరళిని ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుక్షణం సమీక్షిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో తెరాసే మొదటి స్థానంలో ఉంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచీ అనుసరించిన వ్యూహాలన్నీ అనుకున్న విధంగా అమలయ్యాయని తెరాస నేతలు సంతృప్తితో ఉన్నారు.

Munugode By Poll Results : ఏ చిన్న అంశాన్నీ తక్కువ అంచనా వేయకుండా కేసీఆర్ నుంచి కార్యకర్తల వరకూ అందరూ కొన్ని నెలలుగా కష్టపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ రంగంలోకి దిగడం మంచి ప్రభావం చూపిందని తెరాస భావిస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు.. ప్రత్యర్థుల వైఫల్యాలు, లోపాలను ఎత్తిచూపడంలో పార్టీ యంత్రాంగం విజయవంతమైందని తెరాస నాయకత్వం భావిస్తోంది. ప్రచారం ముగిసిన తర్వాత చివరి రెండు రోజులు ప్రత్యర్థుల కదలికలను గమిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పోల్ మేనేజ్​మెంట్ సమర్థంగా నిర్వహించగలిగినట్లు నమ్ముతోంది. వీటన్నింటి ఫలితంగా విజయం సాధించబోతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు విశ్లేషిస్తున్నారు.

పోలింగ్ అనంతరం తనను కలిసిన కొందరు మంత్రులు, ముఖ్య నేతలను కేసీఆర్ అభినందించారు. విజయం ఖాయమని.. అందరి కష్టానికి తగిన ఫలితం రానుందని అభినందించారు. తమకు 20 వేలకు పైగా మెజారిటీ రాబోతోందని మంత్రి హరీశ్​రావు విశ్లేషించారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలంటూ కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. గౌరవ ప్రదమైన మెజారిటీ వస్తుందని నాయకులతో కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని తెరాస శ్రేణులకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. కౌంటింగ్ ఏజెంట్లు, ఇతర బాధ్యులు చివరి వరకూ ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details