తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్‌ ఉప ఎన్నిక: గెలుపునకై పార్టీల పోటాపోటీ ప్రచారాలు - trs latest news

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్ల పరిశీలన పూర్తైంది. అధికార తెరాస , కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నాయి.

Nagarjunasagar by-election, trs and congress
Nagarjunasagar by-election, trs and congress

By

Published : Apr 1, 2021, 10:25 AM IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో అధికార తెరాస క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మంగళవారం సాయంత్రమే అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి లాంఛనంగా ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి రెండ్రోజుల నుంచి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. హోం మంత్రి మహమూద్‌అలీతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉప ఎన్నిక సమన్వయకర్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు బుధవారం హాలియాలో మైనార్టీలతో సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో దాదాపు 7 వేల వరకు మైనార్టీ ఓట్లు ఉండటంతో వారి మద్దతు ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. మరోవైపు మండలాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జ్‌లు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే వ్యక్తిగతంగా ఎంత లబ్ధి పొందారో వివరాలతో పాటు త్వరలోనే ముఖ్యమంత్రి సభ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు వస్తాయని నచ్చజెబుతున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచార క్రతువును ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)నేరుగా పర్యవేక్షిస్తోంది. నిఘా వర్గాలు నియోజకవర్గంలోని పరిస్థితిని మరోసారి సర్వే చేస్తున్నట్లు తెలిసింది.

మండలాల వారీగా ప్రచార బాధ్యతలు

సీనియర్‌ నేత జానారెడ్డి బరిలో ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం చేయడానికి క్షేత్రస్థాయి క్యాడర్‌కు జానారెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు కొంత మంది మండలాల వారీగా బాధ్యతలు తీసుకొని జానారెడ్డికి మద్దతివ్వాలని ఓటర్లను కోరుతున్నారు.

ప్రచారం వ్యూహంలో భాజపా

అసమ్మతి స్వరాలతో సతమతమవుతున్న భాజపా ప్రచారంపై వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వైఖరిపై క్షేత్రస్థాయి క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించినా ఇంకా వారు క్షేత్రస్థాయి ప్రచారాన్ని ప్రారంభించలేదు. మాడ్గులపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య బుధవారం ప్రచారం చేశారు.

ఇదీ చూడండి: సాగర్​ నామినేషన్ల పరిశీలన పూర్తి... 17 తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details