తెలంగాణ ఉద్యమంలో మార్చి 10కి ప్రత్యేకమైన స్థానం ఉందని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మిలియన్ మార్చ్‌ను ఆపడానికి 50 వేల మందిని అరెస్టు చేసినా... ట్యాంక్ బండ్ మీద లక్షలాది మంది పాల్గొని తెలంగాణ జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్ జరిగి ఆ రోజుకి పది ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాలని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని... ఉద్యమ చరిత్రను తుడిచిపెట్టి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్రనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పెరిగిపోయిందని విమర్శించారు. న్యాయవాదులు వామనరావు, నాగమణి హత్యలు తెరాస దౌర్జన్యానికి నిదర్శనమని ఆరోపించారు.