Kodandaram on Reservations: సమరశీల ఉద్యమాలతోనే రిజర్వేషన్లు సాధ్యమని తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 16( 4) ప్రకారం గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి రాజ్యాంగ సవరణ అక్కర్లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు నోచుకోలేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై నిర్వహించిన గిరిజన చైతన్య సదస్సులో కోదండరాం పాల్గొన్నారు.
Kodandaram on Reservations: 'గిరిజన రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు' - Telangana news
Kodandaram on Reservations: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై నిర్వహించిన గిరిజన చైతన్య సదస్సులో తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, బాబు జగ్జీవన్ రావు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పార్లమెంట్, అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని కోదండరామ్ తెలిపారు. గిరిజన రిజర్వేషన్‌ల సాధనకై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం 50 శాతంలోపు రిజర్వేషన్లలో గిరిజనులకు 9.08 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా 9.09 ఉన్నదని 2014 జనాభా లెక్కల ప్రకారం జనాభా శాతం పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే రిజర్వేషన్ విషయంలో తాత్సారం చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. ముస్లిం మైనార్టీ బిల్లును, గిరిజన రిజర్వేషన్ బిల్లుతోపాటు పంపి ఆటంకానికి కారకుడయ్యారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం 10 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీందర్ నాయక్, జాతీయ ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దశరథ నాయక్, తెరాస నేత స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.