Musi Project Gates Lifted : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. ఎగువన గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది.
Musi Project Gates Lifted : మూసీ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత - మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
Musi Project Gates Lifted : తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పలు నీటిపారుదల ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. పెద్దఎత్తున వరద నీరు చేరి నిండుకుండలా మారుతున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసీ రిజర్వాయర్‌కు వరద నీరు ఉద్ధృతంగా చేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు.

ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతుండటంతో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులకు గానూ.. 644.61 అడుగులకు చేరింది. నీటిపారుదల శాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు మూడు గేట్లను పైకెత్తి.. దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1247.79 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 1992.74 క్యూసెక్కులు ఉంది.
మరోవైపు నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోని ఉద్ధృతంగా వరద నీరు చేరుతోంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గానూ.. 679.300 అడుగుల మేరకు నీరు చేరింది. జలాశయంలోకి 1621 క్యూసెక్కుల వరద నీరు చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.