తెలంగాణ

telangana

ETV Bharat / state

NH-65: ప్రమాదాలకు అడ్డాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

NH-65: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డాగా మారింది. విస్తరణ జరిగి దశాబ్దం అవుతున్నా.. పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రహదారిపై ఏటా పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారు. అయినా.. ఎన్‌హెచ్‌ఏఐ, గుత్తేదారు సంస్థ జీఎంఆర్‌ స్పందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

The Hyderabad Vijayawada National Highway has become a haven for accidents
ప్రమాదాలకు అడ్డాగా మారిన.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

By

Published : Jun 14, 2022, 2:17 PM IST

ప్రమాదాలకు అడ్డాగా మారిన.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

NH-65: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు వరుసలుగా ఉన్న హైదరాబాద్‌- విజయవాడ రహదారిని 2007లో అప్పటి ప్రభుత్వం ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. తొలుత నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ... ఈ బాధ్యతను జీఎంఆర్‌ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ పనులు పూర్తి చేసి 2012లో వినియోగంలోకి తెచ్చింది. ఈ రహదారిపై రాజకీయ ఒత్తిళ్లతో పలు ప్రాంతాల్లో నిర్మాణం లోపభూయిష్టంగా సాగింది. తగినన్ని అండర్‌పాసులు, పైవంతెనలు నిర్మించకపోవడంతో తరచూ ప్రాణనష్టం సంభవిస్తోంది. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు లేదా స్థానికులు ఆందోళన చేసినప్పుడు అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నించడం లేదు. పలుమార్లు ఈ రహదారికి సర్వీసు రోడ్లు.. అండర్‌పాసులు నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని నల్గొండ, భువనగిరి ఎంపీలు కోరినా ప్రయోజనం లేకపోయింది.

'నిత్యం ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. చాలా దివ్యాంగులుగా, అనాధలుగా మారుతున్నారు. ప్రస్తుతం అండర్‌ పాస్‌లు చాలా ముఖ్యం. ఇటీవలే ఒక్కరోజే 13 ప్రమాదాలు సంభవించాయి. వాహనాల సంఖ్య పెరగడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. నెషనల్ హైవే వాళ్లు స్పందించి... ఈ ప్రమాదాలను అరికట్టాలని కోరుతున్నాం. డేంజర్ స్పాట్‌లను గుర్తించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ప్రమాద సూచికలు కూడా లేవు.' -స్థానికులు

చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం చౌరస్తా, పెద్దకాపర్తి, చిట్యాల బస్టాండు, చందంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద అండర్‌పాస్‌లు అవసరమున్నా నిర్మించలేదు. దాంతోపాటు కట్టకొమ్ముగూడెం, టేకుమట్ల, జనగాం చౌరస్తా, ముకుందపట్నం, కొమరబండతోపాటు.... కోదాడ బైపాస్, రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద... అండర్‌పాసుల అవసరమున్నా నిర్మించలేదు. నకిరేకల్‌ వద్ద రెండు కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా, సర్వీసు రోడ్‌ నిర్మించలేదు. మునగాల వద్ద సర్వీసు రోడ్‌ అసంపూర్తిగా ఉండగా... చౌటుప్పల్‌లో గతేడాది చెరువు అలుగు పారడంతో సర్వీసు రోడ్డును పలు ప్రాంతాల్లో తవ్వి వదిలేశారు. రహదారిపై పలుచోట్ల అండర్‌ పాస్‌లను నిర్మిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

'ఇనుపాముల వద్ద జాతీయ రహదారి పక్కనే మా ఇల్లు. అందులోనే కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాం. ఇక్కడ అండర్‌పాస్‌ కట్టడంతో పక్కనున్న చెరువు అలుగు పారినప్పుడు నడుం లోతు నీళ్లు నిలిచిపోతున్నాయి. దానివల్ల మా ఇంటి కిందికి మట్టి కొట్టుకుపోయి కూలిపోయే స్థితికి చేరింది. జీఎమ్మార్‌ వాళ్లు తాత్కాలికంగా ఇసుక, సిమెంటు బస్తాలతో అడ్డం పెట్టారు. పూర్తిగా రక్షణగోడ కడతామన్నారు. అంతవరకు వేరే చోట ఉండమంటే కిరాయి ఇంట్లోకి వెళ్లాం. ఆరు నెలలైనా రక్షణగోడ నిర్మించలేదు. అద్దె ఇంటి వాళ్లు ఖాళీ చేయమంటే మళ్లీ ఇక్కడికే వచ్చాం. వర్షాలొస్తే, ఇల్లు ఏమవుతుందో తెలియదు. గోడలు కూడా నెర్రెలిచ్చాయి.' - స్థానికులు

చిట్యాల జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే స్థానికులు భయపడుతున్నారు. రోడ్డు అవతల ఉన్న దుకాణాలకు వెళ్లాలంటే... 5కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని... దుకాణ యజమానులు చెబుతున్నారు. ప్రమాదాలు అరికట్టేందుకు అండర్‌పాస్‌, ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details