తెలంగాణ

telangana

ETV Bharat / state

మిల్లుల ఎదుట బారులు తీరిన లారీలు.. ధాన్యం దిగుమతులకు పాట్లు - farmers issues at ikp centers

నల్గొండ జిల్లా, మిర్యాలగూడ కొనుగోలు కేంద్రం ఎదుట.. ధాన్యం వాహనాలు బారులు తీరాయి. వర్షాకాలం దృష్ట్యా ధాన్యాన్ని వీలైనంత త్వరగా దిగుమతి చేసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యానికి మించి కొనుగోళ్లు చేశామని మిల్లర్లు అంటున్నారు. తడిసిన ధాన్యాన్ని నిల్వ ఉంచితే తాము నష్టాలను చవి చూడాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు.

Miryalaguda ikp Center
Miryalaguda ikp Center

By

Published : Jun 14, 2021, 8:55 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట ఇతర జిల్లాల నుంచి లారీల్లో వచ్చిన ధాన్యం భారీగా నిలిచిపోయింది. మండల పరిధిలోని మిల్లుల వద్ద రబీ ప్రారంభం నుంచి ధాన్యం దిగుమతుల కోసం రైతుల పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం, యాదాద్రి జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం మిర్యాలగూడ పరిధిలోని 63 మిల్లులకు దిగుమతి చేసే విధంగా అధికారులు ప్రణాళికలు చేశారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం.. మిల్లులో సకాలంలో దిగుమతి కాకపోవడంతో అన్నదాతలు వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.

మరోవైపు ధాన్యాన్ని సామర్థ్యానికి మించి కొనుగోలు చేశామని మిల్లర్లు అంటున్నారు. తడిసిన ధాన్యాన్ని నిల్వ ఉంచితే తాము తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. దిగుమతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు.. కొనుగోలులో జాప్యం జరిగిన ధాన్యం దిగుమతులు జరుగుతాయని చెబుతున్నారు. ధాన్యం లోడుతో నిలిచి ఉన్న లారీలకు ప్రభుత్వమే వెయిటేజ్ ఛార్జీని భరిస్తుందని హామీ ఇస్తున్నారు.

ఇదీ చదవండి:దాతలు లేక తరుగుతున్న నెత్తురు నిల్వలు

ABOUT THE AUTHOR

...view details