TCongress: కాంగ్రెస్ కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో.. ఆ పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి ..గత కొన్నేళ్లుగా ప్రత్యర్థి భాజపాను పొగుడుతూ సొంత పార్టీపై విమర్శలు చేయటంపై హస్తం పార్టీ వేచి చూసే ధోరణి ప్రదర్శంచింది. మూడ్రోజుల క్రితం కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించటంతో.. పార్టీ నాయకత్వం వెంటనే రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగానే ఓ వైపు రాజగోపాల్‌పై విమర్శల బాణం ఎక్కుపెడుతూనే.. మరోవైపు పార్టీకి పెట్టనికోటలాంటి ఉమ్మడి నల్గొండలో ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మునుగోడులో క్యాడర్ చేజారిపోకుండా చర్యలు చేపట్టిన పార్టీ నాయకత్వం.. ఇవాళ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, మధుయాస్కీ, తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.