తెలంగాణ

telangana

ETV Bharat / state

Parboiled rice mills in crisis: యాసంగిలో వరి సాగు నియంత్రణపై మిల్లర్ల ఆందోళన

Parboiled rice mills in crisis: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. పారాబాయిల్డ్‌ రైస్​ను కేంద్రం వద్దనడంతో.. రా రైస్‌ను ఉత్పత్తి చేయడం తమకు ఆర్థికంగా భారమని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని.. మిల్లులు మూతపడితే వారి జీవితాలు దుర్భరమయ్యే పరిస్థితి పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Parboiled rice mills in crisis
Parboiled rice mills in crisis

By

Published : Dec 5, 2021, 7:13 AM IST

Rice millers worry on govt decision: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో దీర్ఘకాలంలో ఈ ప్రభావం తమపై ఏమేరకు ఉంటుందోనని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2627 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో 991 పారాబాయిల్డ్‌వి కాగా 1636 రా రైస్‌ ఉత్పత్తిచేసేవి. రాష్ట్రం మొత్తం పారాబాయిల్డ్‌ మిల్లుల్లో సగానికి పైగా ఉమ్మడి నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. రా రైస్‌ మిల్లుల్లో ఎక్కువ శాతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 వరకు మిల్లులుండగా 250 అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లుల్లో కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందజేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రా రైస్‌ను ఉత్పత్తి చేయడం తమకు ఆర్థికంగా భారమని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. మిల్లుల్లో ఇప్పుడున్న సాంకేతికతను మార్చడానికి భారీగా ఖర్చవుతుందంటున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మూతపడితే వారి జీవితాలు దుర్భరమయ్యే పరిస్థితి పొంచి ఉంది.

ఎగుమతులకు స్పష్టమైన విధానం అవసరం..

అరబ్‌ దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, మలేసియా, నేపాల్‌, శ్రీలంకలలో ఇప్పటికీ ఉప్పుడు బియ్యానికి గిరాకీ ఉంది. మన దేశంలోనూ కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ గిరాకీ ఉన్నా మూడు నాలుగేళ్ల నుంచి అక్కడా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇక్కడి నుంచి ఎగుమతులు పడిపోయాయి. విదేశాలకు ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వపరంగా స్పష్టమైన విధానం ఉంటే కొంతలో కొంత ధాన్యం సమస్య గట్టెక్కించవచ్చని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం విక్రయాల్లోనూ నిబంధనలు మారిస్తే వినియోగదారులు, మిల్లర్లకు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం దొడ్డురకాలకు ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ధర క్వింటాకు రూ.1960 చెల్లిస్తోంది. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతుల నుంచి తాము అంత ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే గిట్టుబాటు కాదని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాకు రూ.1500 వరకు కొంటేనే తమకు ఎంతో కొంత మిగులుతుందంటున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో వరి సాగు దృష్ట్యా మిల్లుల్లో సాంకేతికత, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని ప్రభుత్వం గతంలోనే మిల్లర్లకు సూచించింది. దీని కోసం నల్గొండ జిల్లాలోనే సుమారు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వరి సాగు చేయద్దనడంతో పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోదాములన్నీ ఫుల్‌..

ప్రస్తుతం గత రబీ సీజన్‌లో వచ్చిన ధాన్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోదాములన్నీ నిండిపోయాయి. ఇప్పుడు వానాకాలం పంట కొనుగోళ్లు సగం మేర పూర్తయ్యాయి. ఎఫ్‌సీఐ మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ గత యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా 3.5లక్షల టన్నుల బియ్యం గోదాముల్లోనే మూలుగుతోంది. వీటిని త్వరితగతిన ఖాళీ చేస్తే వానాకాలం ధాన్యం మిల్లింగ్‌ చేసి ఆ బియ్యాన్ని గోదాముల్లో నింపుతారు. తగినన్ని ర్యాక్స్‌ (రైళ్లు) రాకపోవడంతోనే బియ్యం ఎఫ్‌సీఐకి పంపడంలో జాప్యమవుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు.

దీర్ఘకాలంలో ఇబ్బందులే..

వరి సాగు నియంత్రణతో ఇప్పటికప్పుడు సమస్య లేకపోయినా ఈ పరిశ్రమ కింద పనిచేస్తున్న వారు దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్​ అన్నారు.

ప్రభుత్వం ఓ విధానం తేవాలి..

ఇప్పుడున్న బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి సాంకేతికతను మార్చి రా రైస్‌ను ఉత్పత్తి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని నల్గొండ జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిట్టప్రోలు యాదగిరి తెలిపారు. మన రాష్ట్రంలో ఎక్కువగా బాయిల్డ్‌ మిల్లులే ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా అటు రైతులు, ఇటు మిల్లర్లు నష్టపోకుండా ఓ విధానం తీసుకొస్తే రైతులు పండించిన పంటను కొనడానికి మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని యాదగిరి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:CM KCR REVIEW: ధాన్యం కొనుగోళ్లపై ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details