విసునూరు దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా 1920లో షేక్ బందగీ సాగించిన వీరోచిత పోరాటం మొదలు.... 1951 వరకు సాగిన రైతాంగ సాయుధ పోరాటం ముగింపు వరకు భూమి, భుక్తి విముక్తి కోసం సుదీర్ఘ పోరు సాగింది. భూస్వాముల నిర్భంధం, రజాకార్ల అకృత్యాలను భరించలేని సామాన్య రైలతులు, కూలీలు బందూకులు చేతబట్టి కదనరంగంలోకి దూకారు. నాటి పోరాటంలో ఎందరో వీరవనితలు మాన, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా కర్కశ మూకలకు ఎదురొడ్డి నిలిచిన నాటి పోరాటం నేటికీ ఏ నాటికీ స్పూర్తిదాయకమే. అందులో కీలకంగా నిలిచిన బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, కడవెండి, విసునూరు, పరిటాల పాత్ర ఎంతో కీలకమైనది.
జలియన్ వాలాబాగ్ ఉదంతానికేమాత్రం తీసిపోని మారణహోమానికి నిలువెత్తు సాక్ష్యం.. వరంగల్ జిల్లా బైరాన్‌పల్లి. అప్పటికే 3సార్లు రజాకార్లను తరిమికొట్టిన ఉత్సాహంతో భారీ నష్టాన్ని అంచనా వేయలేకపోయాయి బైరాన్ పల్లి గ్రామరక్షక దళాలు. ఆ రోజు ప్రజలంతా గాఢనిద్రలో ఉన్నారు. నిజాం రజాకార్లు గ్రామంపై పడి దోచుకుంటున్నారు. గ్రామరక్షక దళాలు, గ్రామస్థులపై పై ఆధునిక ఆయుధాలతో నిజాం సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఆ ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 118 మంది వీరులు ప్రాణాలర్పించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో.. రజాకార్ల రాక్షస కాండకు మరో పరాకాష్ట... గుండ్రాంపల్లి దురంతం. రజాకారు క్యాంపు నాయకుడు సయ్యద్ మక్బూల్ అరాచకాలకు అంతే లేకుండా పోవటంతో అతడికి బద్ది చెప్పాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. 1948 జూన్ 19న రామిరెడ్డి నాయకత్వంలో మక్పూల్ పై దాడి చేశారు. చిన్న పొరపాటుతో మక్పూల్ తప్పించుకున్నాడు. ప్రతీకారంతో రగిలిన మక్బూల్ అంతులేని అరాచకాలకు తెగబడ్డాడు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు 200 మందిని కిరాతకంగా హత్యచేసి గుండ్రాంపల్లి మసీదు సమీపంలోని పెద్దబావిలో పడేశాయి రాజాకారు మూకలు.
అమరథామం. వరంగల్ జిల్లా పరకాలలో వెలసిన పోరాటయోధుల ప్రతిమలక్షేత్రం ఇది. 1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లా పరకాలలో ఉద్యమ నేతల పిలుపుతో అనేక గ్రామాల ప్రజలు త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఊరేగింపుగా బయలుదేరారు. వందేమాతరం అంటూ నినాదాలిచ్చారు. తహసిల్దార్ విష్ణువేశ్వర్ రావు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే... కాల్పులకు ఆదేశించడంతో తుపాకులు గర్జించాయి. ఆ ఘటనలో 23 మంది పోరాట యోధులు చనిపోయారు. ఆనాడు ప్రాణాలొదిలిన అమరవీరుల ప్రతిరూపాల బొమ్మలను అమరధామం చుట్టూ ఏర్పాటు చేశారు.
కడవెండి... తెలంగాణ సాయుధ సమరానికి గుండెకాయ. నిజాంసేనల తుపాకీ తూటాలకు ఎదురొచ్చిన దొడ్డి కొమరయ్య ప్రాణాలొదిలిన గడ్డ. మహిళా పోరాట చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మలకు పురుడు పోసిన పోరుగడ్డ. విసునూరు దేశముఖ్ జన్నారెడ్డి రామచంద్రారెడ్డి ఏలుబడిలోని కడవెండి గ్రామరైతుల్లో పెల్లుబికిన అసంతృప్తి.. సాయుధ పోరులోని తొలిఘట్టానికి నాంది పలికింది. శిస్తు కట్టనందుకు దొర తాబేదారులు చాకలి ఐలమ్మ ఇంటిపై దాడి చేసి దౌర్జన్యంగా ధాన్యం ఎత్తుకుపోయారు. పొలం లాక్కున్నారు. ఆమె భర్త, కుటుంబ సభ్యులను దొర గడీలో బంధించారు. ఆ ఆకృత్యాలకు ఊరంతా ఏకమైంది. భీంరెడ్డి నరసింహ్మారెడ్డి నేతృత్వంలో దొరగడీపై దాడి చేశారు. దొడ్డి కొమరయ్య దొర తొత్తుల తూటాలకు బలై తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడిగా చరిత్రకెక్కాడు. ఈ ఘటన విముక్తి కోసం సాగుతున్న ఆందోళనలకు సాయుధ రూపునిచ్చింది.
సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన కీలక గ్రామాల్లో విసునూరు అత్యంత కీలకమైనది. దేశముఖ్ లుగా పిలువబడే దొరలు ప్రజలను అనేక అకృత్యాలకు గురిచేశారు. విసునూరు దేశముఖ్ దుర్మార్గాలు మాటల్లో వర్ణించలేనివి. తన ఆధీనంలో ఉన్న 40 గ్రామాల ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించాడు. ప్రతి కులస్థులు పన్ను చెల్లించాల్సిందే. పేద ప్రజలు నాన కష్టాలు పడి పండించిన పంటను శిస్తు రూపంలో దోడుకునే వాడు. స్త్రీలపై అనేక రకాలుగా వేధించేవాడు. దొరకు వ్యతిరేకంగా పాలకుర్తి ఐలమ్మ పోరాటం చరిత్రకు తార్కాణం. షేక్‌బందగీ చిందిన రక్తం వారికి మార్గదర్శకం.
నిజాంకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో పాలమూరు జిల్లాలో జరిగిన అనేక ఘటనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాయి. రజాకార్లను ఎదిరించి నిలిచినందుకు వారు జరిపిన కాల్పుల్లో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి ఘటన అందులో ప్రధానమైనది. ఆ గ్రామానికి చెందిన బెల్లం నాగన్న ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహించేవాడు. గ్రామానికి చెందిన ఎంతోమంది ఉద్యమకారులుగా పనిచేసేవాళ్లు. 1947 అక్టోబర్ 7న ఉద్యమకారుల్ని పట్టుకునేందుకు రజాకార్లు అప్పంపల్లికి చేరుకున్నారు. అది తెలుసుకున్న గ్రామస్తులు ఎదురు రావడంతో తోక ముడిచిన రజాకార్లు ఓ భవనంలో తల దాచు కున్నారు. అక్కడ కిటికీలోంచి కాల్పులకు తెగబడడంతో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆనాటి అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటారు గ్రామస్తులు.
పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న పరిటాల గ్రామం కూడా ఆనాడు నిజాం అరాచకాలకు బలైంది. నిజాం నవాబు కమలియార్ జంగ్ బహద్దూర్ ఆధీనంలో ఉన్న జాగీరుకు చెందిన 3తాలుకాల్లో ఖానాత్ ఒక్కటి. ఈ ఖానాత్ తాలూకాలో పరిటాల, గని ఆత్కూరు, బత్తినపాడు, మొగల్తూరు, ఉస్తేపల్లి, కొడవటిగల్లు. మల్లవల్లి అనే ఏడు గ్రామాలుండేవి. బ్రిటీష్ పాలన నుంచి భారత దేశం విముక్తి పొందినా పరిటాల మాత్రం నిజాం నవాబు ఏలుబడిలోనే ఉండి పోయింది. అసంతృప్తితో కుమిలి అసహనంతో రగిలిన పరిటాల ప్రజలు నిజాంపై కదంతొక్కి స్వతంత్రంగా పాలించుకున్న ఘనత పరిటాల గ్రామానిది.
ఇదీ చూడండి..