TJS working group meeting in Nalgonda : ప్రజలే కేంద్రంగా పాలించే రాజకీయాలు రావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే కేంద్రంగా పాలించే రాజకీయాలు రావాలని కోరారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ కొనుగోలు వేగవంతం కాలేదని మండిపడ్డారు.
తరుగుదల పేరుతో దోచుకుంటున్నారు :ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం రాశులు కొట్టుకు పోతుంటే రైతులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నా.. ప్రభుత్వానికి చలనం లేకుండా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు నాణ్యత చూసినప్పటికీ.. మిల్లర్లు వివిధ కారణాలతో తరుగుదల పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ మిల్లర్లు వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు.
పాలకుల జేబుల్లోకి నిధులు వెళుతున్నాయ్ : పంచాయతీ కార్యదర్శుల సమ్మెను ఉద్దేశిస్తూ.. పాలేర్లు సమ్మె చేస్తే భూస్వాములగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ పేరుతో పాలకుల జేబుల్లోకి నిధులు మళ్లిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇదే జరిగిందని చెప్పారు. ఆ ప్రాజెక్టులో నాయకుల జేబుల్లోకి వెళ్లిన నిధులు.. కృష్ణా నది ప్రాజెక్టులపై పెడితే ఇప్పటికే పూర్తి అయి ఉండేవని వివరించారు.