T Congress Nirudyoga Nirasana Rally: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ నేతల ఐక్యతను చాటింది. మర్రిగూడ కూడలి నుంచి పెద్ద గడియారం వరకు కొనసాగిన నిరసన ర్యాలీలో.. పెద్ద సంఖ్యలో హస్తం కార్యకర్తలు, నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిరసనలో పాల్గొన్నారు.
12 సీట్లు గెలిపిస్తారన్న ధీమా: పెద్ద గడియారం సెంటర్‌లో మాట్లాడిన సీనియర్ నేత జానారెడ్డి.... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిపిస్తారన్న ధీమా కలుగుతోందన్నారు. జిల్లాలో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. యుద్ధం వచ్చినప్పుడు అందరం ఐక్యంగా పోరాడతామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నల్గొండకు జలకళ తీసుకొస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా.. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం తొమ్మిదేళ్లలో ఇంచు కూడా ముందుకెళ్లలేదని ఆరోపించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ఉత్తమ్ నిలదీశారు. తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమైనా.. కేసీఆర్ ప్రభుత్వం అవేమీ అమలు చెయ్యలేదని.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
ఎందుకు చర్యలు తీసుకోలేదు: దళితబంధులో ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్ తీసుకుంటున్న చిట్టా ఉందని చెబుతున్న కేసీఆర్... అలాంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు మంత్రులుగా పని చేసిన నల్గొండ జిల్లాలో.. ఇప్పుడు ఎలాంటి నాయకులను చూస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలనను కేసీఆర్ గాలికొదిలేశారని విమర్శించారు.