నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని దండెంపల్లిలో దాదాపు దశాబ్దంన్నర క్రితం మూతపడిన లెదర్‌పార్కును పునః ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో తోలు ఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న సర్కారు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసి స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 25.06 ఎకరాల్లో 18 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసి అనంతరం మూతపడిన లెదర్‌పార్కులో త్వరలోనే కార్యకలాపాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర తోలు పరిశ్రమాభివృద్ధి సంస్థ (టీఎస్ లిడ్‌క్యాప్) సన్నాహాలు చేస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 అక్టోబరు 26న అప్పటి ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉమామాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మినీ లెదర్ పార్కును ప్రారంభించారు. కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, భువనగిరి ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది వరకు చెన్నైలోని కేంద్ర లెదర్ పరిశోధన సంస్థ (సీఎల్‌ఆర్‌ఐ) ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. చెన్నైలో శిక్షణ పొందిన వారు రెండేళ్ల పాటు ఉమ్మడి జిల్లాలోని మరికొందరికి శిక్షణ ఇస్తూనే ఇందులోనే చెప్పులు, బూట్లు, బ్యాగులు, కీచైన్లు, బెల్టులు తయారు చేసేవారు. స్థానికంగా దాదాపు 350 మంది వరకు అప్పట్లో ఉపాధి లభించేది. అనంతర పరిణామాలతో పరిశ్రమకు సరైన నిధులు రాకపోవడంతో కాంగ్రెస్ హయాంలో 2005లో మూతపడింది. అప్పట్లో కొనుగోలు చేసిన యంత్రాలన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఇటీవలే దాదాపు ఆరు యంత్రాలు దొంగతనానికి గురికాగా పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకొని వాటిని తిరిగి రాబట్టారు.
రూ.10 కోట్ల వరకు నిధులు
ఈ పరిశ్రమను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీనివల్ల ఇప్పటికే ఉన్న భవనానికి తోడు అవసరమైతే మరో భవన నిర్మాణం, మౌలిక వసతులు, భూమిచుట్టూ ప్రహరీని నిర్మించనున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో వీలైనన్ని నిధులు కేటాయించి ఉత్పత్తులు సైతం అదే విధంగా ఉండేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా స్థానిక దళిత యువకులకు అవగాహన, ప్రదర్శనల నిర్వహణ, నైపుణ్య శిక్షణ కార్యకలాపాలను నిర్వహించనున్నారు.