తెలంగాణ

telangana

ETV Bharat / state

street schools: ఆ ఊళ్లో ప్రతీవిధిలో ఓ  బడి.. అదెక్కడో కాదు మన తెలంగాణలోనే! - thirumalagiri mandal silgapuram village

కరోనా కారణంగా పాఠశాలలు మూసి వేసిన సమయంలో పుస్తకానికి విద్యార్థులు దూరం కావొద్దనే ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు విభిన్న ఆలోచనతో పాఠాలను వారికి చేరువ చేశారు. గ్రామంలోని వీధుల్లో అక్షరమాల, ఆంగ్ల అక్షరాలు, అంకెలను ఫ్లెక్సీలు వేయించి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ప్రతి వీధిలో ఓ ఇంఛార్జిని ఏర్పాటు చేసి కొవిడ్​ కాలంలో పిల్లలకు చదువును చేరువ చేశారు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం శిల్గపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు.

school
school

By

Published : Aug 29, 2021, 2:39 PM IST

లాక్​డౌన్​ వల్ల విద్యాలయాలకు తాళంపడి సుమారు రెండేళ్లుగా పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఆన్​లైన్​లో తరగతులు నిర్వహిస్తున్నా అవి అంత ప్రభావం చూపించలేదనేది చాలా మంది అభిప్రాయం. అయితే బడిఈడు పిల్లలు కొవిడ్​ వల్ల చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం శిల్గపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు ఓ వినూత్న విధానంలో పిల్లలకు చదువును చేరువ చేశారు.

వీధివీధిన చార్టులు ఏర్పాటు

ఊరిలోని ప్రతి వీధి కూడళిలో అక్షర మాల, వర్ణమాల, గుణింతాలు, ఆంక్ష అక్షరాలు ఫ్లెక్సీలు వేయించి ఏ వీధి విద్యార్థులు అక్కడే చదువుకునే సౌకర్యం కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైదులు, మరో ఇద్దరు సహోపాధ్యాయలు కలిసి... గ్రామంలో ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థుల కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఫ్లెక్సీలను చూసి చదువుకుంటున్న విద్యార్థులు

లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ పాఠాల వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గ్రామాల్లో ఎక్కువ మంది వద్ద స్మార్ట్​ ​ఫోన్​ లేకపోవడం వల్ల పాఠాలకు దూరమయ్యేవారు. పాఠాలు ప్రదర్శితమయ్యే సమయంలో విద్యార్థులు పొలాల వెంబడి ఉన్న సందర్భాలను మేము చూశాము. ఇలా అయితే విద్యార్థులు చదువుకు దూరమవుతారనే ఉద్దేశంతో ప్రతి వీధిలో పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ఇతర ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతో పిల్లలకు ఆడుకునే చోటే చదువుకునే సౌకర్యం కల్పించాం. ఏటా మా స్కూలు నుంచి సుమారు పదిమంది వరకు వివిధ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. సైదులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

ఉపాధ్యాయుల చొరవ అభినందనీయం

స్వచ్ఛంద వాలంటీర్​, గ్రామస్థులు, పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతి వీధిలో ఓ ఇంఛార్జిని ఏర్పాటు చేసి పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్నారు. ప్రతి చోట రోజు మార్చి రోజు ఉపాధ్యాయుడు హాజరవుతూ విద్యార్థుల ప్రగతిపై ఆరా తీసేవారు. లాక్​డౌన్​ సమయంలో విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు తీసుకున్న చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు. తమ ఊరి నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లరని... తమ బంధువులు కూడా వారి పిల్లలను తమ గ్రామంలోని బంధువు ఇళ్లలో ఉంచి చదివిస్తున్నారని పేర్కొన్నారు.

వీధిలో పిల్లలకు పాఠాలు బోధన

లాక్​డౌన్​ వల్ల పాఠశాలలు మూడబడి పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఊర్లలో పిల్లలు ఆన్​లైన్​ వసతి అందరికీ లేకపోవడం వల్ల ఆటలుపట్టిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో ప్రతి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెద్దలు పొలాలకు వెళ్లిపోయిన సమయంలోను ఇంటి వద్దనే ఉన్న పిల్లలు వీధుల్లో అడుకునే పిల్లలు అక్కడే చదువుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయుల కృషి అభినందనీయం. కల్యాణ్​, గ్రామస్థుడు.

ఫ్లెక్సీలను చూసి చదువుకుంటున్న విద్యార్థులు

చాలా బాగుంది..

గ్రామంలో మేము ఆడుకునే చోట ఫ్లెక్సీలు పెట్టారు. ప్రతి వీధి దగ్గర ఒకరు ఉండి పాఠాలు చెబుతున్నారు. మాకు చాలా బాగా అర్థం అవుతున్నాయి. -భార్గవి, విద్యార్థిని.

అయిదో తరగతి విద్యార్థులను పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేయిస్తున్నారు. కొందరు ఇప్పటికే పలు విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో సీటు సాధించారు.

ఇదీ చూడండి:SABITHA INDRA REDDY: విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం

ABOUT THE AUTHOR

...view details