లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో పది పరీక్షలు నిర్వహించరేమోనని చాలామంది భావించారు. హైకోర్టు తీర్పుతో వెంటనే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆందోళన నెలకొంది.
తక్కువ సమయంలో పక్కా ప్రణాళికతోనే విజయం సాధించడం సులువని విద్యార్థులు గ్రహించాలి. బట్టీ విధానాన్ని పక్కనబెట్టి చదివిన అంశాలను పునశ్ఛరణ చేయాలి. విద్యార్థులు పరీక్షల్లో తప్పులు చేయకుండా ఎలా మసలుకోవాలో విషయ నిపుణులు సూచనలు అందిస్తున్నారు. కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలని అభిప్రాయపడుతున్నారు.
ఆంగ్లంపై భయం వద్దు
ఆంగ్ల పరీక్ష అనగానే విద్యార్థులు కంగారుపడతారు. పరీక్షలకు ముందు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరోసారి పునశ్ఛరణ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్ఛు చేతిరాతను మెరుగుపరుచుకుంటే మంచి మార్కులు వస్తాయి. వ్యాసరూప సమాధానాలను రెండు పేజీలకు తగ్గకుండా సృజనాత్మకతతో రాయాలి. జవాబులు రాసే క్రమంలో విద్యార్థులు ప్రశ్న క్రమసంఖ్యను మర్చిపోకుండా చూసుకోవాలి. ప్రతిసారి క్రమసంఖ్యను వేయడం మర్చిపోవడంతో సమాధానాన్ని కొట్టివేయాల్సి వస్తోంది. 13 - 17 ప్రశ్నలను ప్రతి పదం చదవడం ద్వారా సులువుగా రాయడానికి అవకాశం ఉంటుంది. వ్యాకరణంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కు ప్రాధాన్యమివ్వాలి.
బాలరాజు, ఇంగ్లిష్ విషయ నిపుణుడు
భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి
సాంఘికశాస్త్రం చివరి రోజు ఉందని.. తీరిగ్గా చదువుదామని విద్యార్థులు యోచిస్తారు. అలాంటి ఆలోచనలు పక్కనపెట్టి మరోమారు అన్ని పాఠ్యాంశాలను చదవాలి. భౌగోళిక అంశాలపై దృష్టి సారించాలి. శీతోష్ణస్థితి, జనాభాకు సంబంధించినవి పూర్తిగా చదవాలి. భారత రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, ప్రపంచ యుద్ధాలు, తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్ఛు హరితహారం, పర్యావరణ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, సామాజిక అంశాలపై ప్రశ్నలుంటాయి. అందుకే సమకాలిన అంశాలపై దృష్టి సారించాలి. పాఠ్యపుస్తకంలోని పట్టికలు, గ్రాఫ్‌లను తదితర అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. వీటితో పాటు విశ్లేషణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.