తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2020, 11:42 AM IST

ETV Bharat / state

వీధి దీపాల నిర్వహణ నుంచి గ్రామపంచాయతీలు దూరం...

పల్లెల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలు దూరమవుతున్నాయి. వీధి దీపాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ సంస్థ (ఈఈఎస్‌ఎల్‌) చూడబోతుంది. సంస్థకు అప్పగించాలని కోరుతూ ప్రతి గ్రామం నుంచి తీర్మానం చేసి పంపించాలని మండల పంచాయతీ అధికారులకు లేఖలు వచ్చాయి. ఇప్పటికే సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పూర్తి స్థాయిలో పంచాయతీల వీధి దీపాల బాధ్యతను ఏజెన్సీ చేతిలో పెట్టింది. దీనిపై కొందరు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

street lights maintenance will not in panchayath hands
street lights maintenance will not in panchayath hands

నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో వీధి దీపాల నిర్వహణ సరిగా సాగడంలేదు. పలు గ్రామాల్లో రాత్రింబవళ్లు వెలుగుతూనే ఉంటున్నాయి. అసలే నాసిరకం బల్బులు కావడంతో తక్కువ రోజుల్లోనే పాడైపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక లైను లేకపోవడంతో విద్యుత్తు లైన్లకే నేరుగా బల్బులు అమర్చుతున్నారు. ఫలితంగా కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి.

వద్దంటే వినరే..

ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగిస్తే గ్రామాల్లో తమ ఉనికి దెబ్బతింటుందని సర్పంచులు, వార్డు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీధిలో దీపం వెలగలేదంటే ఇన్ని రోజులు ప్రజలు వారికే ఫిర్యాదు చేసేవారు. వాటిని బాగు చేయించడం, కొత్తవి అమర్చడం ద్వారా కొద్దోగొప్పో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది. కరెంటు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవిస్తే ఏకంగా తమను బాధ్యతల నుంచే తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వీధిదీపాల నిర్వహణను ఏజెన్సీకి అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పంచాయతీలు తీర్మానాలు చేస్తున్నాయి.

కొత్త విధానం ఇలా..

ఈఈఎస్‌ఎల్‌ సంస్థ పంచాయతీల వారీగా తీర్మానం చేసిన మేరకు అవసరం ఉంటే ఎల్‌ఈడీ బబ్బులు అమర్చుతుంది. వీటికి ఆ సంస్థే పెట్టుబడి పెడుతుంది. నిర్వహణ ఖర్చును నెలనెలా గ్రామపంచాయతీల నుంచి వసూలు చేస్తుంది. రాత్రిపూట వెలిగేలా ఆటోమేటిక్‌ పరికరాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌ నుంచి రిమోట్‌ కంట్రోల్‌ విధానంలో అన్ని పంచాయతీల్లో వీధిదీపాలు ఆన్‌, ఆఫ్‌ చేసే అవకాశం ఉంటుంది. పైగా వాటికి బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఎక్కడైనా ఏదైనా దొంగతనం జరిగినా.. విపత్తులతో నష్టం వాటిల్లినా బీమా పరిహారం వస్తుంది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే సంప్రదించేందుకు ప్రతి గ్రామంలో సంబంధిత సంస్థ ప్రతినిధి పేరు, చరవాణి నంబరు ప్రచారం చేస్తారు. ప్రభుత్వం ఈ సంస్థతో ఏడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. 18, 35, 70, 110, 190 వాట్ల ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

185 తీర్మానాలు వచ్చాయి: విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీవో, నల్గొండ

ప్రభుత్వం ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసు సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రతి పంచాయతీ దీన్ని అంగీకరించాల్సిందే. మండలస్థాయి అధికారులకు లేఖలు ఇది వరకే పంపించాం. ఇప్పటి వరకు 185 పంచాయతీల తీర్మానాలు అందాయి.

ఏజెన్సీ నిర్వహణలో అంధకారమే: ఉప్పునూతుల వెంకన్న, సర్పంచి, జి.చెన్నారం

వీధిదీపాల నిర్వహణ సంస్థకు అప్పగిస్తే పల్లెలు అంధకారమవుతాయి. బిల్లుల చెల్లింపు నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం ఏజెన్సీకి వీధిదీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు ఉంది. ఇది సరికాదు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటయ్యాయి. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే సర్పంచులకు తెలుస్తుంది. దాన్ని పరిష్కరిస్తున్నారు. ఏజెన్సీకి నిర్వహణ అప్పగించాల్సిన అవసరం లేదు.

ఇదీ చూడండి: ఎల్​టీ, హెచ్​టీ కనెక్షన్ల ఆధారంగా ఆన్​లైన్​లో పరిశ్రమల లెక్క

ABOUT THE AUTHOR

...view details