Happy Valentines Day 2023: ప్రేమ అనేది రెండు అక్షరాలకే పరిమితమైంది కాదు. రెండు క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. అది ఒక అనిర్వచనీయ అనుభూతి. ఓ సినీ కవి పేర్కొన్నట్టు..‘ప్రేమ దివ్యభావం..ప్రేమ దైవ రూపం’. ప్రేమను నిజంగా మనసుపెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ‘ఆది, అంతం లేని అమరానందమే’.
రెండు హృదయాల్లో సెలయేరులా పారుతుంది. అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నపుడు ప్రేమే జీవరాగమవుతుంది. ఆ ప్రేమే జ్ఞానయోగమూ అవుతుంది. ప్రేమతో ఇతరుల మనసులు గెలుచుకోవడమే గొప్ప. అలాంటి అపురూపమైన ప్రేమకు దాసులు కానివారు ఎవరుంటారు. ఎవరో ఒకరు... ఎపుడో అపుడు.. ఎక్కడో అక్కడ ప్రేమను ఆస్వాదించే ఉంటారు, అలాంటి అనుభూతిని అనుభవించే ఉంటారు.
Valentines Day 2023: ప్రేమ గుడ్డిది అంటారు. తమకు నచ్చినవారి ఆస్తులు, అంతస్తులను చూడకుండా వారి మనసును మాత్రమే అది నమ్ముతుంది. నిజమైన ప్రేమను నమ్మినవారు తమ జీవితభాగస్వామిని కూడా జీవితాంతం ప్రేమగా, నమ్మకంగా చూసుకుంటారు. ప్రేమను ప్రేమగానే చూడాలి. ప్రేమించడం అంటే బాహ్య సౌందర్యం చూసి ఒక అభిప్రాయానికి రావడం కాదు. జీవితాన్ని చక్కదిద్దుకునే సమర్థత కలిగి ఉండాలి.
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు అంగీకరించకుంటే, తమ నడవడిక, జీవితంలో ఎదుగుదల వంటివాటితో వారిని తమ దారిలోకి తీసుకురాగలగాలి. ఎంతకాలం కలిసి ఉంటారు చూద్దాం అంటూ హేళన చేసినవారిని తలదన్నేలా తాము జీవితంతో చక్కగా స్థిరపడడంతోపాటు తమ పిల్లలు కూడా ఎంతో ఎత్తుకు ఎదిగేలా తీర్చిదిద్దిన వారూ ఉన్నారు. ఇలా.. బంధాలు, బాంధవ్యాలకు వారధిగా నిలిచే ప్రేమను.. ప్రేమగా ప్రేమించి తాము ప్రేమించిన వారిని ప్రేమగా చూసుకుంటూ, అప్పటి వరకు తమ నిర్ణయాలను అంగీకరించని ఇరు కుటుంబాల పెద్దల మనసులను తమ ప్రేమతో గెలిచిన కొందరి జంటల గురించి నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...
అవాంతరాలకు కుంగిపోలేదు :1993లో కుటుంబ సభ్యులను మెప్పించి పెళ్లి చేసుకున్నాం. పట్టణంలోని కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో చదివేటప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా ఒక్కటై ముందుకు నడిచాం. సమాజంలో అవాంతరాలు ఎదురైనా కుంగిపోలేదు. మా ఇద్దరు కుమారులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరికీ ప్రేమ పంచడం నేర్చుకుంటే జీవితంలో విజయవంతమవుతాం.
అన్యోన్య దాంపత్యం : మాది కులాంతర వివాహం. 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆస్తులు, అంతస్తులు అడ్డు గోడలుగా నిలిచినా ఆమె నాచేయిపట్టి నడిచింది. కాల గమనంలో రెండు కుటుంబాలు మనస్పర్థలు వీడి ఒక్కటయ్యాయి. మూడు దశాబ్దాలుగా మా దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోంది. ఉన్నంతలోనే ఇద్దరు కూతుళ్లకు మంచి చదువులు చెప్పించాం. మా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది. బంధాలకు, బాంధవ్యాలకు వారధిగా నిలిచేది. అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చేదే ప్రేమ. తరాలు మారినా ఈ పదానికి అర్థం మారదు.