గడువు ముగిసి రెండేళ్లైనా పూర్తికాని నక్కలగండి ప్రాజెక్టు నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులుండే దేవరకొండ, మునుగోడు, అచ్చంపేట నియోజకవర్గాలకు నీరందించేందుకు గాను... నక్కలగండి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 3.5 లక్షల ఎకరాలకు సాగు, 526 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు పనుల్ని... రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ 2015 ఆగస్టులో చేజిక్కించుకుంది. అయితే భూసేకరణలో జాప్యం వల్ల 5 నెలలు ఆలస్యంగా... 2016 జనవరిలో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం మిగులు జలాల్ని 43 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ ద్వారా నక్కలగండికి తరలించి ఓపెన్ కెనాల్ ద్వారా... టన్నెల్-2 ఔట్ లెట్ నుంచి నేరెడుగొమ్ము గ్రామం వద్ద చేపట్టిన ఇన్ టేక్‌వెల్‌కు పంపుతారు. అక్కణ్నుంచి పెండ్లిపాకల మీదుగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలిస్తారు.
ఇప్పటివరకు అందని పరిహారం
430 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన నక్కలగండి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం... 7.64 టీఎంసీలు. గత నాలుగేళ్ల కాలంలో 250 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా మరో 180 కోట్ల చెల్లింపులు జరగాల్సిన తరుణంలో... డబ్బులు రావడం లేదంటూ పనుల్ని అర్థంతరంగా నిలిపివేశారు. మొత్తం 17 గేట్లకు గాను 16 గేట్ల పనులు పూర్తవగా... తలుపులు బిగించాల్సి ఉంది. శ్రీశైలం మిగులు జలాలు ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేనందున... డిండి నుంచి మిగులు, వరద జలాలతోపాటు సిద్ధాపూర్ చెరువు నీటితో నక్కలగండిలో 4 టీఎంసీలు నిల్వ చేయాలని 2017లో అప్పటి సాగునీటి మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కానీ అది కూడా ఆచరణ సాధ్యం కాలేదు. ముఖ్యంగా మొన్నటి భారీ వర్షాల వల్ల డిండి నుంచి పారిన అలుగుతో 6 టీఎంసీల నీరు వృథా అయింది. ఈ నీరు నక్కలగండి మీదుగా నాగార్జునసాగర్‌లో కలిసింది. అలుగు పారిన నీరు నక్కలగండికి చేరి నిల్వ ఉండటం వల్ల పనులకు ఆటంకం కలిగింది. ఇక 4 టీఎంసీల నిల్వ వల్ల నక్కలగండి తండాతోపాటు నాగర్ కర్నూల్ జిల్లాలోని మార్లపాడు, కేశ్యనాయక్ తండా ముంపునకు గురవుతున్నాయి. అక్కడ నిర్వాసితుల్ని గతంలోనే గుర్తించినా ఇప్పటివరకు పరిహారం అందలేదు.
మోక్షం ఎప్పుడో..?
దేవరకొండ నుంచి తెల్దేవర్ పల్లి, మోత్య తండా, యలమలమంద, పొగిళ్ల సహా మొత్తం 8 గ్రామాలకు వెళ్లే దారి నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురైంది. ఈ ఎనిమిది పల్లెల్ని నియోజకవర్గ కేంద్రాన్ని కలిపే 7 కిలోమీటర్లతోపాటు... నాగర్ కర్నూల్ జిల్లాలో 6 కిలోమీటర్ల దారి కూడా అటవీ ప్రాంతంలో ఉండి ఈ రెండూ ముంపు బారిన పడుతున్నాయి. వీటి పునర్నిర్మాణాల కోసం మూడేళ్ల క్రితమే 65 కోట్లు మంజూరు చేసినా.... అటవీ శాఖ నుంచి ఇంతవరకు అనుమతి రాలేదు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రాజెక్టు ఆనకట్టే తాత్కాలిక రోడ్డుగా మారిపోయింది. రెండు జిల్లాల్లో దారుల నిర్మాణాలకు అటవీ శాఖ నుంచి క్లియరెన్స్, నీటి నిల్వ వల్ల ముంపునకు గురయ్యే మూడు గ్రామాలకు పరిహారం విషయం తేలితే ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారులకు నివేదిక అందింది. అక్కణ్నుంచి అనుమతి రాగానే పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.