కరోనా రెండో దశ ఉద్ధృతితో ప్రాణావాయువు కోసం రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో.. ఖాళీ పడకలు లేకపోవడంతో చాలామంది ప్రైవేటు దవాఖానాల్ని ఆశ్రయిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రస్తుతానికి ఒకట్రెండుకు మించి ఆక్సిజన్ పడకలు ఖాళీగా లేవంటే రోగుల తాకిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా జిల్లాల జనరల్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ట్యాంకులు ఉండగా మిగతా చోట్ల సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. ట్యాంకులు లేని ప్రాంతాల్లో సిలిండర్లు వాడుతుండటం వల్ల నిత్యం పెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తోంది. మిర్యాలగూడలో 40 పడకలకు.. ఒక్కో పడకకు ఒక్కో సిలిండర్ వినియోగించడం వల్ల రోజూ రూ.35 వేల దాకా ఖర్చవుతోంది. అక్కడ ఇంకో 20 పడకల కోసం స్థలం చూసి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అన్ని వైద్యశాలల్లోనూ అదనపు పడకలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో స్వల్ప ఖాళీలు..
నల్గొండ జిల్లా జనరల్ ఆసుపత్రితోపాటు ఏరియా ఆసుపత్రులు కొవిడ్ రోగులతో రద్దీగా మారాయి. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ దవాఖానాల్లో పడకలను పెద్ద సంఖ్యలో కరోనా బాధితులకు కేటాయించారు. ఆక్సిజన్ పడకలు జిల్లా ఆసుపత్రిలో 190, దేవరకొండలో 50, మిర్యాలగూడలో 40, సాగర్‌లో 40, నకిరేకల్‌లో 2 ఉన్నాయి. అందులో 95 శాతం నిండిపోగా, 5 శాతం మాత్రమే ఖాళీలున్నాయి. సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో 190, హుజూర్ నగర్లో 5 ప్రాణవాయువు పడకలు ఉండగా.. 99 శాతం నిండిపోయాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో నిత్యం 20 నుంచి 30 మంది ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తూ సాధారణ పడకల్లో కాలం గడుపుతున్నారు. యాదాద్రి జిల్లా ఆసుపత్రిలో 20, ఎయిమ్స్‌లో 24, ఆలేరు సీహెచ్‌సీలో 21, చౌటుప్పల్ సీహెచ్‌సీలో 5, రామన్నపేట సీహెచ్‌సీలో 4 పడకల్ని కేటాయిస్తే.. అందులో 43 శాతం పడకల్లో రోగులు ఉన్నారు. మిగతా 57 శాతం ఖాళీగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా వైద్యాలయంలో 12 టన్నుల ట్యాంకు.. 190 పడకలకుగాను 5 రోజులు వస్తోంది. గతంలో 12 టన్నుల ట్యాంకు 2 నెలలు వచ్చేది. ప్రాణవాయువు అవసరం ప్రస్తుతం ఏ మేరకు ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
పైరవీలకే పట్టం..