తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రైతుల సంకల్పంతో.. బీళ్లలో బంగారం పండుతోంది!

కరువు కోరలు చాచింది. వర్షాకాలంలోనూ భూమి బీళ్లు వారుతోంది. కాలువ ఊళ్లోనుంచే వెళుతున్నా... చెరువు దాహంతో నోళ్లు చాచుతోంది. భూమి ఉన్నా, నీళ్లున్నా... దురదృష్టం వారిని వెంటాడుతోంది. పాలకవర్గం, యంత్రాంగం వీరి కన్నీటిని తుడవలేక పోయింది. విసిగి వేసారిన రైతాంగం సంఘటితమైంది. ఫలితంగా... ఇరవై ఏళ్లుగా నెర్రలు చాచిన భూమిలో జల సిరి పొంగిపొర్లుతోంది. అందరికీ ఆదర్శమైన ఆ రైతులెవరు.. ఆ పల్లెల కథెంటో చదివేద్దామా...

special story about nakrekal formers in nalgonda district
ఆ రైతుల సంకల్పంతో.. బీళ్లలో బంగారం పండుతోంది!

By

Published : Mar 6, 2020, 9:31 PM IST

ఆ రైతుల సంకల్పంతో.. బీళ్లలో బంగారం పండుతోంది!

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ , చందనపల్లి, బొల్లారం, కడపర్తి గ్రామాల్లో ఏడాది క్రితం వరకు పంటలు పండించడం అరుదు. గ్రామాల పక్క నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రధాన కాల్వ వెళుతున్నా అక్కడి చెరువుల్లోకి చుక్కనీరు వచ్చేది కాదు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా గంగమ్మ జాడ కనిపించేది కాదు. ఈ కారణంగా ఎందరో వ్యవసాయానికి దూరం కాగా.. మరికొందరు ఉన్నకాసిన్ని నీటితో తిప్పలు పడేవారు. దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పంటలను కాపాడుకునే వారు. ఇలా ఒక్కో గ్రామం ఏడాదికి కోటి రూపాయల వరకు ఖర్చు చేయక తప్పలేదు. కాల్వ ద్వారా చెరువులు నింపాలని రైతులు ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా.. వారి గోడు ఎవరికీ పట్టలేదు. ఈ క్రమంలో అక్కడి రైతుల్లో మెరిసిన ఓ ఆలోచన... వారి జీవితాలను మార్చేసింది.

కదిలిన కర్షకులు:

నాలుగు గ్రామాలకు చెందిన రైతులందరూ తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని సంఘటితంగా కదిలారు. సొంత డబ్బుతోపాటు కొందరు దాతల సహకారంతో మోటార్లను తీసుకొచ్చారు. తలాపు నుంచి వెళ్తున్న కాలువకు వాటిని బిగించి ఎత్తిపోతల ద్వారా గ్రామాల్లోని ఎగువన ఉన్న చెరువులు, కుంటలు నింపారు. ఆ నీటిని నేరుగా సాగుకు వినియోగించకుండా భూగర్భ జలాలను పెంచుకున్నారు. రైతుల భగీరథ ప్రయత్నంతో నేడు ఆయా గ్రామాల్లో బావులు, బోర్లలో నీటి లభ్యత ఒక్కసారిగా పెరిగింది. గతంలో ఆరేడు వందల అడుగులకు పడిపోయిన భూగర్భ జలాలు ప్రస్తుతం అరవై అడుగులకు చేరుకున్నాయి. ఇరవై ఏళ్లుగా బీళ్లుగా మారిన భూములన్నీ ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆయా ఊళ్ల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాలు సాగులోకి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వాలకోసం ఎదురు చూడకుండా సంఘటితంగా కరవును జయించిన ఈ అన్నదాతల పట్టుదల తోటి రైతులకు స్ఫూర్తిదాయకం.

ఇదీ చూడండి:అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

ABOUT THE AUTHOR

...view details