ఆ గుడిలో మహాత్మాగాంధీని పూజిస్తారు.. ప్రపంచానికి శాంతి పాఠం బోధించి, ప్రజలను అహింస మార్గంలో నడిపించిన ఆదర్శమూర్తి మహాత్మాగాంధీ. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయులకు ఇంత చేసిన మహాత్మునికీ ఒక గుడి ఉంటే బాగుండు అని అనుకున్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి ప్రజలు. అనుకుందే తడవుగా పెద్దకాపర్తిలో గాంధీకి గుడి కట్టించారు.
ఎప్పుడు కట్టారంటే..
గుడి నిర్మాణానికి గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ 2012 గాంధీ జయంతి రోజున భూమి పూజ చేసి... 2014 సెప్టెంబరు 15న గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి బాపూజీ నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఏటా గాంధీ జయంతి రోజున హోమాలు, వ్రతాలు, ప్రత్యేక పూజలు, అన్నదానం ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయం ఏమేమి ఉంటాయి..?
దేశంలోని కాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్, హరిద్వార్, తిరుపతి వంటి 30 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని వివిధ పేటికల్లో అమర్చి భక్తుల సందర్శించేందుకు వీలుగా గుడి ఆవరణలో ఉంచారు. ఇక్కడ ఆరు పవిత్ర మత గ్రంథాలతో పాటు బాపూజీ రచించిన సత్యశోధన ప్రతులను భద్రపరచారు.
పంచభూతాలకు ఓ ఆలయం..
ఈ గుడిని నాలుగెకరాల సువిశాల ప్రాంతంలో నిర్మించారు. మొదటి అంతస్తులోని గర్భగుడిలో మహాత్ముడు ధ్యానముద్రలో ఆశీనుడై భక్తులకు దర్శనమిస్తారు. గుడి కిందనున్న అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. గుడి మెట్లపైన బాపూ చెప్పిన సూక్తులు కనిపిస్తాయి. ఆలయానికి ఇరువైపులా నవగ్రహ దేవతలు, పంచభూతాల ఆలయాలు ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పంచభూతాలకు ఆలయం నిర్మించటం ప్రత్యేకం.
అందరూ మహాత్ముని బాటలో నడవాలని ఓ మంచి ఆశయంతో ఆలయం నిర్మించటం నిజంగా అభినందనీయం.. అటుగా వెళ్ళినపుడు మహాత్ముని గుడిని దర్శించుకుని ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులను వెంట తీసుకెళ్తారంటున్నారు అహింసావాదులు.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి