తెలంగాణ

telangana

ETV Bharat / state

నిదానంగా సాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు.. - graduate mlc voter registration online in telangana

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో పెద్దగా స్పందన కనపడటం లేదు. మరో 3 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటివరకు 30 శాతం మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 లక్షల వరకు పట్టభద్రులుంటే.. అందులో ఇప్పటివరకు 3 లక్షల 70 వేల మందికి పైగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అటు పార్టీల అభ్యర్థులు సైతం అవగాహన కల్పిస్తున్నా.. స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది.

Slow-progressing in graduate mlc voter enrollment in joint nalgonda district
నిదానంగా సాగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు..

By

Published : Nov 3, 2020, 9:40 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు నిదానంగా సాగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో సోమవారం వరకు 3 లక్షల 73 వేల 658 మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఆఫ్​లైన్ కంటే ఆన్​లైన్​కే ఆదరణ కనిపిస్తోంది. ఆన్​లైన్​లో 2 లక్షల 99 వేల 510 మంది, ఆఫ్ లైన్ ద్వారా 74 వేల 148 మంది పేర్లు నమోదయ్యాయి. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 లక్షల మంది వరకు పట్టభద్రులు ఉండగా.. అందులో ఇప్పటివరకు 30 శాతానికి పైగా మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజులు మాత్రమే గడువుండగా.. పట్టభద్రులైన యువత అంతగా ఆసక్తి చూపడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అటు వివిధ పార్టీల అభ్యర్థులు.. అన్ని చోట్లా పర్యటిస్తూ నిరుద్యోగ యువతే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆశించిన రీతిలో కనపడని ఆసక్తి

అధికార తెరాస ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించి.. గ్రామానికో బాధ్యుణ్ని నియమించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో నమోదైన ఓటర్ల జాబితాలో అధికార పార్టీ శ్రేణులు చేర్పించిన ఓటర్లే 40 శాతం మంది ఉన్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో పోటీకి ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించకపోయినా.. తెలంగాణ జన సమితి నుంచి కోదండరాం, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్ బరిలో ఉన్నారు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జయసారథి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన సుధగాని హరిశంకర్ గౌడ్ సహా అభ్యర్థులంతా యువతను ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినా ఓటర్ల నమోదుకు పట్టభద్రుల నుంచి ఆశించిన రీతిలో ఆసక్తి కనపడటం లేదు.

ఇవీ చూడండి: దుబ్బాక ఎన్నిక వేళ సిద్దిపేటలో మరోసారి ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details