ఎన్ని చట్టాలొచ్చినా ఆగని ఆడపిల్లల విక్రయాలు... భ్రూణ హత్యలు! నల్గొండ జిల్లాలోని గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గంలో... ఆడపిల్లల్ని పురిట్లోనే వదిలించుకుంటున్నారు. 1991లో చందంపేట మండలం తెల్దేవరపల్లి ఆవాసప్రాంతమైన నక్కలగండితండాలో... ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని వడ్ల గింజ వేసి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి పటిష్ట చట్టాల్ని అమలు చేస్తున్నామని చెబుతున్నా... ఆచరణలో సాధ్యం కావడంలేదు.
అక్టోబరులో చందంపేట మండలం పోల్యనాయక్ తండాకు చెందిన దంపతులకు... మూడో కాన్పులో ఆడశిశువు జన్మించింది. శిశువును వదిలించుకునే క్రమంలో... ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. ఇదే మండలం యాపలపాయ తండాలోని దంపతులకు... మూడో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అక్కడా అమ్మాయిని ఇతరులకు ఇవ్వాలని చూస్తే... ఐసీడీఎస్ రంగంలోకి దిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం చందంపేట మండలంలో... ప్రతి వెయ్యి మంది పురుషులకు 834 మంది బాలికలున్నారు.
ఆగని ఆడపిల్లల విక్రయాలు
ఆడశిశువుల విక్రయాలు, భ్రూణహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు... 2008లో గ్రీన్ క్రాస్, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో ఊయల పథకాన్ని ప్రవేశపెట్టారు. మూణ్నాలుగేళ్ల కాలంలోనే వంద మందికి పైగా చిన్నారుల్ని... ఐసీడీఎస్‌కు అప్పగించారు. గిరిజన కుటుంబాల్లో కొడుకుకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో... మగ పిల్లాడి కోసం ఎన్ని కాన్పులనైనా భరించేందుకు సిద్ధపడుతున్నారు. కొందరు దంపతులకు ఎనిమిది, తొమ్మిది మంది తర్వాత మగశిశువు పుట్టిన సందర్భాలుంటున్నాయి. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా... దేవరకొండ నియోజకవర్గంలో ఆడపిల్లల విక్రయాలు ఆగడం లేదు.
గర్భంలో ఉండగానే చిదిమేస్తున్నారు...
దళారులు ప్రముఖ పాత్ర వహిస్తూ... తండాల్లోని పిల్లల్ని అమ్ముతూ సంపాదిస్తున్నారు. అటు స్థానికంగా ఉండే ఆర్ఎంపీలు సైతం... శిశువుల విక్రయాలు, అప్పగింతల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. స్కానింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లే అవకాశం అందరికీ ఉండదు. ఇదే అదనుగా స్థానిక వైద్యులు కమీషన్లు తీసుకుంటూ... గర్భిణుల్ని స్కానింగ్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ లింగనిర్ధరణ పరీక్షలు చేసిన తర్వాత ఆడపిల్ల అని తేలితే... గర్భంలో ఉండగానే చిదిమేయడమో లేక, పుట్టిన తర్వాత వదిలించుకోవడమే చేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ...ఆడశిశువుల విక్రయాలు ఆగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
మగ సంతానం కావాలనే... భర్త వేధింపులతో...
గత జనవరిలో ఓ తండాలోని దంపతులకు... తొమ్మిదో సంతానంగా అమ్మాయి జన్మించింది. ఆ చిన్నారిని వదిలించుకునే క్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్‌తో బిడ్డ... తల్లి ఒడికి చేరింది. అత్తమామల బెదిరింపులు, మగ సంతానం కావాలన్న భర్త వేధింపులతో... చాలా మంది గిరిజన మహిళలు వరుస కాన్పులతో ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఐసీడీఎస్‌కు... ఏటా పెద్ద సంఖ్యలో ఆడశిశువుల్ని అప్పగిస్తుంటారు. అయితే అప్పగింత వ్యవహారంలో అధికారుల కౌన్సెలింగ్ తప్పదని భావిస్తున్న దంపతులు... మధ్యవర్తుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి వాటి గురించి బయటకు రాకుండా...ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భ్రూణ హత్యలు, శిశు విక్రయాలపై ఎంతగా దృష్టి సారించినా గుట్టు చప్పుడు కాకుండా పనికానిచ్చేస్తుండటంతో... అమ్మాయిల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది.
ఇవీ చూడండి: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు