తెలంగాణ

telangana

ETV Bharat / state

చండూరు పురపాలిక పారిశుద్ధ్యం అస్తవ్యస్తం - చండూరు పురపాలక సంఘం

ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన చండూరు పురపాలికలో పారిశుద్ధ్యం లోపించింది. సరిపడా కార్మికులున్నప్పటికీ అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణలో విఫలమయ్యారు.

వెంటనే పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించాలి : పుర ప్రజలు

By

Published : Sep 2, 2019, 6:36 PM IST

చండూరు పురపాలిక పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

నల్గొండ జిల్లాలోని చండూరు పురపాలక సంఘం పనితీరు అధ్వాన్నంగా ఉందని స్థానికులు మండిపడ్డారు. ఫలితంగా పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అధికారులకి పూర్తి స్థాయిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటికీ చెత్త సేకరణ సరిగ్గా చేపట్టలేకపోయారని ఆగ్రహించారు.

అధ్వాన పరిస్థితిలో కాలనీలు...

వర్షాకాలం కావడం వల్ల వీధులన్నీ మురుగుతో నిండిపోయాయి. మట్టి రోడ్లు ఉన్న కాలనీల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. దీనికి తోడు పందుల సంచారం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు సోకే ప్రమాదం ఉండటం వల్ల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సక్రమంగా రాని చెత్త సేకరణ వాహనం

పురపాలక పరిధిలో చండూరు గ్రామ పంచాయతీతో పాటు లక్కీనిగూడెం, అంగడిపేట గ్రామాల్లో మొత్తం నాలుగు వేల ఇళ్లు ఉన్నాయి. మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్త సేకరణకు 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చెత్త సేకరణకు ఆరు తోపుడు బండ్లతోపాటు ఒక ట్రాక్టర్​ను వినియోగిస్తున్నారు. చండూరులో పూర్తి స్థాయి స్వచ్ఛత, పరిశుభ్రత నిర్వహించట్లేదని గ్రామస్తులు వాపోయారు. కొన్ని కాలనీల్లో నెలకు ఒకటి లేదా రెండు సార్లకు మించి చెత్త సేకరణ జరగట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ స్థలం లేదని...

చండూరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయిందన్నారు. పురపాలిక ఏర్పాటుతో అయినా పూర్తి స్థాయి అభివృద్ధి సాధిస్తుందనుకుంటే అదీ కలగానే మిగిలిపోయిందని గ్రామస్తులు వాపోయారు. చండూరు మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ డంపింగ్ యార్డ్ కచ్చితంగా ఉండాల్సి ఉండగా ప్రభుత్వ స్థలం లేదన్న సాకుతో ఏర్పాటు చేయలేదు. ఫలితంగా చెత్త మొత్తం వీధుల్లోనే ఉంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి : గ్రేటర్​ పరిధిలో జీహెచ్​ఎంసీ హరితహారం

ABOUT THE AUTHOR

...view details