ప్రజల్లో తమకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే తపన ఒకరిది. పునర్వైభవం చాటుకునేందుకు ఇదే సరైన వేదికనే ఆశ మరొకరిది. అధికారంలోకి రాబోయేది తామేననే ధీమా ఇంకొకరిది. ఇలా... నాగార్జునసాగర్ ఉపఎన్నికతో రాష్ట్రంలో భవిష్యత్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు బాటలు వేసుకుంటున్నాయి.
తెరాస బలాలు, బలహీనత
తెరాస నుంచి పోటీ చేస్తున్న నోముల భగత్... ఇంతకాలం తండ్రి చాటు తనయుడిగా ఉన్నారు. నర్సింహయ్య హఠాన్మరణంతో టికెట్ రేసులో... ఆయన పేరు తెరపైకి వచ్చినా... చివరి నిమిషం వరకు అభ్యర్థిత్వంపై దోబూచులాటే నెలకొంది. విపరీతమైన పోటీ మధ్య ఎట్టకేలకు భగత్... పోటీ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. 50 శాతానికి పైగా బీసీలున్న సాగర్‌లో... అదే వర్గం నుంచి బరిలోకి దిగడం భగత్‌కు బలమని చెప్పాలి. యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన... తన సామాజిక వర్గ ఓట్లు పెద్దఎత్తున పోలవుతాయని భావిస్తున్నారు. సర్కారు సంక్షేమ పథకాలు... తెరాస అభ్యర్థికి బలమవుతున్నాయి. నెల్లికల్ ఎత్తిపోతలకు స్వయంగా ముఖ్యమంత్రి భూమి పూజ చేయటం, తిరుమలగిరి సాగర్ మండలంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవటం... ఈ ఎన్నికల్లో కలసివస్తాయన్న భావన తెరాసలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలంతా కొన్నిరోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి... భగత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. నెలన్నర నుంచి ఏడు మండలాల బాధ్యతల్ని... ఒక్కో చోట ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల చొప్పున పర్యవేక్షిస్తున్నారు. వీటన్నింటికి తోడు నిన్న కేసీఆర్... హాలియా బహిరంగసభకు హాజరుకావటం మరింత ఉత్సాహాన్ని నింపిందని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.
నోముల భగత్
నోముల భగత్ బలహీనతల విషయానికి వస్తే... సాధారణ ఎన్నికల్లో తన తండ్రి నర్సింహయ్య వెంట ఉండి... ఆయన గెలుపులో కీలకపాత్ర వహించినా... నియోజకవర్గంలో పెద్దగా పరిచయాల్లేవు. కేవలం అభ్యర్థి సామాజికవర్గానికే... తెరాస అధిక ప్రాధాన్యమిస్తోందని జరుగుతున్న ప్రచారం... మిగతా బీసీ కులాల్ని నిరాశకు గురిచేస్తోంది. ఇక టికెట్ ఆశించి భంగపడిన నేతలు... తెరవెనుక తమ సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థికి సహకరిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అదే జరిగితే భగత్ ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. మరోవైపు యువకుడైన భగత్... ఎమ్మెల్యేగా గెలిస్తే... భవిష్యత్తులో తమకిక అవకాశమే ఉండదన్న భావన.... తెరాసకు చెందిన కొందరు నేతల్లో అసంతృప్తి రాజేస్తోంది. ఇలాంటి అంశాలు భగత్‌కు బలహీనతలుగా తయారయ్యే ప్రమాదముంది.
కాంగ్రెస్ బలాలు, బలహీనత
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి... ఇక్కడి నుంచే వరసగా పదకొండోసారి పోటీ చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ చివరి పది, పదిహేను రోజులే ప్రచారం చేసే జానారెడ్డి... ఈసారి ఎత్తుగడను మార్చారు. రెండున్నర నెలల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో... పరిచయాలుండటం జానాకు ప్రధాన బలం. పల్లెపల్లెలోనూ అనుచర గణం ఉండటంతోపాటు... పార్టీలోనూ ఆయనకు మంచి పేరు ఉంది. ఎవరితోనూ విభేదాలు లేకపోవడంతో... అందరూ ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపారు. రాజకీయ చాణక్యం.. ఎంతటి వారినైనా తనవైపునకు తిప్పుకోగల నైపుణ్యం జానాకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెరాస, భాజపాలో ఉన్న జానా శిష్యులు... ఆయా పార్టీల్లో టికెట్లు దొరక్క అసంతృప్తులుగా ఉన్నందున... అలాంటి వారంతా ఈ ఉపఎన్నికల్లో జానా వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.