కొవిడ్ ప్రభావంతో అన్ని వ్యవస్థలూ కునారిల్లిన ప్రస్తుత తరుణంలో ఆ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ బాధ్యతలు మోస్తున్న ఆర్టీసీపైనా పడింది. మొత్తం బస్సుల్లో 60 శాతం రోడ్లెక్కినా... వస్తున్న ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. కరోనా వ్యాప్తి భయంతో జనం ప్రయాణాలు తగ్గించడం వల్ల రాబడికి భారీగా గండిపడుతోంది. నల్గొండ ఆర్టీసీ రీజియన్ 7 డిపోల పరిధిలో 750 బస్సులకు గాను 450 తిరుగుతున్నాయి. సగటున ఒక్కో బస్సులో 16 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.
90 వేలకు తగ్గింది
నల్గొండ రీజియన్ పరిధిలో జూన్ నెల శుభకార్యాల వల్ల అంతో ఇంతో ఆదాయం సమకూరింది. కరోనా వ్యాప్తి , ఆషాఢ మాసం, వర్షాలరాకతో పొలం పనుల్లో రైతుల నిమగ్నమవడం వల్ల ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. గతంలో మూడు లక్షల మంది ప్రయాణాలు సాగించగా... ఇప్పుడది 90 వేలకు తగ్గింది.