తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిహారంలో నిర్లక్ష్యం.. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం

ప్రధాన పట్టణాలను, ప్రాంతాలను కలిపే జాతీయ రహదారుల నిర్మాణం కోసం రహదారుల విస్తరణ విషయంలో జాప్యం జరుగుతుండడం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. చిన్నపాటి వానలకే గుంతల మయంగా మారే రోడ్లు.. ఇక భారీ వర్షాలు పడితే వాటి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇదే పరిస్థితి నల్గొండ- నకిరేకల్​ జాతీయ రహదారి 565 మధ్య నెలకొంది. రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చే వారికి అందించే పరిహారంలో జాప్యం జరుగుతుండటం వల్ల బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రహదారుల నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

roads-damage-on-nalgonda-nakirekal-national-highway-565
పరిహారంలో నిర్లక్ష్యం.. ఫలితంగా రహదారి విస్తరణ పనుల్లో జాప్యం

By

Published : Nov 1, 2020, 1:34 PM IST

Updated : Nov 1, 2020, 4:54 PM IST

రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి చెల్లించే పరిహారంలో జాప్యం జరుగుతుండటం వల్ల నిర్మాణ పనులు ఆగిపోతున్నాయి. పరిహారం కోసం బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోగా.. ఇప్పుడేమో నిధుల కొరతతో ఆటంకం ఏర్పడింది. రోడ్డు విస్తరణ పనులు మధ్యంతరంగా ఆగిపోవడం వల్ల రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సాగే ప్రధాన రహదారి పనుల్లో స్థానిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి.

పరిహారంలో నిర్లక్ష్యం.. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం

ఐదేళ్లుగా అలాగే..

మహారాష్ట్రలోని సిరోంఛ నుంచి ఏపీలోని రేణిగుంట వరకు నిర్మితమవుతున్న 565 జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. నిర్మాణ పనుల్లో భాగంగా నల్గొండ జిల్లా నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు 23 కిలోమీటర్ల మేర ద్వితీయ ప్యాకేజీ కింద 2014 లో అధికారులు పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. రహదారి విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన ప్రజలకి పరిహారం చెల్లించకుండానే పనులు మొదలుపెట్టడం వల్ల బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గుత్తేదారు సంస్థ పనుల్ని నిలిపివేసింది.

ఇదే అదనుగా రైతుల భూములతో సంబంధం లేని ప్రాంతాల్లోనూ పనులను ఆపేసింది. నకిరేకల్ మండలం తాటికల్ వద్ద వంతెన నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా ఐదేళ్లుగా పనులు పునఃప్రారంభం కాకుండా ఉన్నాయి.

గుంతలమయం..

నల్గొండ జిల్లా కేంద్రానికి నకిరేకల్ దగ్గరగా ఉండటం వల్ల ఇరు పట్టణాల మధ్య భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఎన్​హెచ్​ 565 మీదుగా ఈ వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. నకిరేకల్, సూర్యాపేట, నల్గొండ ప్రయాణికులు వారి సొంత వాహనాలకు ఇదే మార్గాన్ని ఎంచుకుంటారు. విస్తరణ పనులను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారింది. గుంతలకు తోడు, వర్షం వచ్చినపుడు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.

అక్కడక్కడా చిన్నచిన్న మరమ్మతులు చేపట్టినా... వర్షాలకు అదంతా కొట్టుకుపోయి, మళ్లీ గుంతలు కనిపిస్తున్నాయి. తాటికల్, ఆర్లగడ్డ గూడెం, చిన్నసూరారం, పెద్దసూరారం, అగ్రహారం, చందనపల్లి, పానగల్ ప్రాంతాల వాసులు కంకర రోడ్డుపై అవస్థలు ఎదుర్కొంటున్నారు.

తమకు పరిహారం అందించకపోగా పనులు మధ్యలోనే ఆపేయగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్​ ప్రవేశపెట్టినప్పుడు పరిహారం చెల్లిస్తామని అధికారులు అంటున్నా.. చెల్లింపులు చేసేదెప్పుడు, రహదారిని బాగుపరిచేదెప్పుడంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు.

ఇదీ చదవండి:అన్నదాతలను అవస్థలకు గురిచేస్తున్న సన్నరకం సాగు

Last Updated : Nov 1, 2020, 4:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details