Road Damaged in Nakirekal : ఇది ఎక్కడో మారుమూల శివారు గ్రామాలకు వెళ్లే రహదారి కానేకాదు.. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్ పురపాలికలోని తిప్పర్తి రోడ్డు ఇది. నిత్యం వేలాది మంది ప్రజలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రహదారిపైనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పురపాలిక కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇదే కావడం గమనార్హం. కిలోమీటరు పొడవునా..221 గుంతలతో అధ్వానంగా మారింది. దీనిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ద్విచక్రవాహనదారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల షాక్‌అబ్జర్వర్స్ దెబ్బతింటున్నాయని, ఒక సారి వీటిని మార్చితే కారుకు రూ.13 నుంచి 15 వేలు ఖర్చవుతోందని యజమానులు వాపోతున్నారు. నకిరేకల్ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి చీమలగడ్డలోని అండర్‌పాస్ వంతెన వరకు కిలో మీటరు మేర మాత్రమే దెబ్బతిన్న ఈ రహదారి ఐదేళ్ల నుంచి బీటీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్యాచ్ వర్క్‌లు కూడా సరిగా చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన దీనిపై గుంతలు పూడ్చే తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.